కేరళలోని ఒక ఆయుర్వేద వైద్యుడు రూ. 10000 విలువగల అత్యంత ఖరీదైన ఆయుర్వేద సబ్బుని తయారు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఎటువంటి చర్మ సమస్యలనైనా పరిష్కరించడానికి ఒక అద్వితీయమైన ఫార్ములాతో ఈ సబ్బుని తయారుచేశారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఈ కేరళ వైద్యుడు తయారు చేసిన సబ్బు ఫార్ములా హక్కులని రతిరా ఆయుర్వేద సంస్థ సంపాదించిందని, ‘రతీరా బట్టర్’ పేరుతో ఈ సబ్బును రతిరా ఆయుర్వేద సంస్థ రూ. 299కు దేశంలోని ప్రజలకు కొనుగోలు చేస్తుందని పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, ఇరాన్‌లో ఈ సబ్బుకి చాలా మంది కొనుగోలుదారులున్నారని, భారత దేశంలో తయారైన ఈ సబ్బుకు టాక్స్ మరియు ఇతర ఖర్చులను కలుపుకొని ఇరాన్ వినియోగదారుల వద్దకి చేరేసరికి దీని ధర పదివేల రూపాయలు ఉంటుందని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళలోని ఒక ఆయుర్వేద వైద్యుడు రూ.10000 విలువగల అత్యంత ఖరీదైన ఆయుర్వేద సబ్బుని తయారుచేశాడు.
ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో తెలుపుతున్న సమాచారాన్ని రతీరా పేరుతో రూపొందించిన పలు ఫేక్ వెబ్సైట్లు ఆర్టికల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని చదివి ‘రతీరా బట్టర్’ సబ్బు కొనాలనుకొనే కస్టమర్లను తమ వెబ్సైటులో పేరు, మొబైలు నంబర్ వివరాలను ఇవ్వాలని కోరుతున్నారు. వివరాలు తెలిపిన తరువాత తమ ఆయుర్వేదిక్ నిపుణుడు ఒకరు మీకు ఫోన్ చేసి మాట్లాడుతారని తెలుపుతున్నారు. ‘రతీరా బట్టర్’ సబ్బును సాధారణంగా రతీరా ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక వెబ్సైటులో ఆన్లైన్లో కొనవచ్చు. కేరళలోని ఆయుర్వేద ఫార్మసిలో పనిచేసి వ్యక్తి యొక్క పాత ఫోటోని షేర్ చేస్తూ కేరళ డాక్టర్ రూ.10000 ఖరీదైన సబ్బు తయారు చేశారని తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేస్తున్న సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, రతిరా ఆయుర్వేద సంస్థ పేరుతో పలు వెబ్సైట్లు ఇదే సమాచారాన్ని షేర్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని చదివి ‘రతీరా బట్టర్’ సబ్బు కొనాలనుకొనే కస్టమర్లను తమ వెబ్సైటులో పేరు, మొబైలు నంబర్ వివరాలను ఇవ్వాలని కోరుతున్నారు. వివరాలు తెలిపిన తరువాత తమ ఆయుర్వేదిక్ నిపుణుడు ఒకరు మీకు ఫోన్ చేసి మాట్లాడుతారని ఈ వెబ్సైట్ తెలుపుతుంది.
రెండు ‘రతీరా బట్టర్’ సబ్బుల ప్యాకేజీను రతీరా ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధికారిక వెబ్సైటులో రూ. 299కు ఆన్లైన్లో కొనవచ్చు. రతీరా ఆయుర్వేద సంస్థ పేరుతో ఫోనులో మాట్లాడి తమ దగ్గర డబ్బులు దోచుకొని మోసం చేశారని కొందరు వినియోగదారులు కన్స్యూమర్ ఫోరంలో కంప్లయింట్ కూడా ఇచ్చారు. ‘రతీరా బట్టర్’ సబ్బుని కుంకుమ పువ్వు, మేక పాలు, ఆలివ్ నూనె తదితర పదార్ధాలను ఉపయోగించి రూపొందిస్తారని, చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి ఈ సబ్బు ఎంతగానో పనిచేస్తుందని ఈ ప్రాడక్ట్ వివరణలో తెలిపారు. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు చర్మ సమస్యలను పరిష్కరించగల సామర్ధ్యం ఈ సబ్బుకు ఉన్నట్టు రతీరా ఆయుర్వేద సంస్థ ఎక్కడ తెలుపలేదు.
ఇరాన్ దేశంలో ఈ ‘రతీరా బట్టర్’ సబ్బును రూ. 10000కు అమ్ముతున్నారని ఎక్కడా రిపోర్ట్ అవలేదు. అలాగే, పోస్టులో షేర్ చేసిన వ్యక్తి ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Alamy’ వెబ్సైటులో 2009లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కేరళ అలెప్పిలోని ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న వ్యక్తి ఫోటో అని ఈ ఫోటోను మరికొన్ని వెబ్సైట్లు కూడా షేర్ చేశాయి.
ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన, బంగారం మరియు వజ్రం పౌడరుతో తయారచేసిన, సబ్బును లెబనాన్‌కు చెందిన వ్యాపార సంస్థ విక్రయిస్తుంది. దీని విలువ సుమారు 2000 డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 2 లక్షలకు పైగా ఉంటుంది.
ఈ పోస్టులో తమ సంస్థ ప్రాడక్టులకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టతనివ్వాలని మేము రతీరా ఆయుర్వేద సంస్థకు ఈ-మెయిల్ చేసాము. ఈ-మెయిల్ సమాధానం వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.
చివరగా, కేరళలోని ఆయుర్వేద వైద్యుడు రూ.10000 విలువగల అత్యంత ఖరీదైన ఆయుర్వేద సబ్బుని తయారుచేసాడంటూ షేర్ చేస్తున్న ఈ పోస్ట్ తప్పు.