Fake News, Telugu
 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగురవేశారు అనే ప్రచారంతో షేర్ చేయబడుతున్న ఈ ఫొటోలో వాస్తవం లేదు.

0

కాంగ్రెస్ వస్తే భారత దేశం పాకిస్థాన్ అవుతుంది అని రుజువు చేశారు అని చెప్తూ,  ఒక వ్యక్తి ఒక పచ్చ జెండా పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ  పోస్టు షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఈ ఫొటోలో కనిపిస్తున్నది పాకిస్థాన్ జాతీయ జెండా. 

ఫాక్ట్(నిజం): ఇది పాకిస్థాన్ దేశపు జాతీయ జెండా కాదు. ఇది కేవలం మతపరమైన జెండా. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఈ ఫోటో కర్ణాటకలో తీసినదే అయినా, అందులో కనిపిస్తున్న జెండా పాకిస్థాన్ దేశానిది కాదు అని మా పరిశోధనలో తెలిసింది. 

మొదటిగా, ఈ ఫోటో వెనుక ఉన్న వాస్తవాలు ఎంటో తెలుసుకోవటానికి, దాన్ని ఉపయోగించి ఇంటర్నెట్లో రెవెర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. వచ్చిన ఫలితాల్లో ఒక ట్వీట్‌లో పోస్టులో ఉన్న ఫోటోకు చెందిన వీడియో ఉంది, అందులో ఉన్న వివరణ ఈ సంఘటన కర్ణాటకలోని భత్కల్‌లో జరిగింది అని సూచిస్తుంది. 

దీన్ని క్లూగా తీసుకుని ఇంటర్నెట్లో సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఈ ఫొటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ సంఘటన నిజంగానే భత్కల్ టౌనులో జరిగినట్లు తెలిసినది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి భత్కల్-హొన్నావర్ నియోజకవర్గ MLAగా నెగ్గిన మంకాల్ వైద్య’ని ఆహ్వానిస్తూ భత్కల్ టౌనులో చేపట్టిన ఒక ర్యాలీలో తీసిన చిత్రం అని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ ర్యాలీలో ఎగురవేసిన పచ్చ జెండా పాకిస్తాన్ దేశ జండా కాదని ఉత్తర కన్నడ జిల్లా SP విష్ణువర్ధన్ N తెలిపినట్టు వార్తా భారతి పత్రిక తమ కథనంలో పేర్కొనింది. అసలు ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. ‘ఇది మతపరమైన జెండా,  పాకిస్థాన్ జెండా కాదు. మేము దానిని ధృవీకరించాము. మతపరమైన అశాంతిని సృష్టించే ఎలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని షేర్ చేయవద్దని మేము సోషల్ మీడియా వినియోగదారులకు అభ్యర్థిస్తున్నాము’ అని వార్తా భారతితో SP విష్ణువర్ధన్ అన్నారు. 

ఈ ర్యాలీకి సంబంధించిన ఓ వీడియో కథనంలో, పచ్చ రంగు జెండాలతో పాటు, కాషాయ రంగు జెండాలని కూడా కొందరు పట్టుకొని ఊపడం మనం చూడవచ్చు.

పాకిస్థాన్ జెండాకు వైరల్ అవుతున్న జెండాకు తేడా ఉంది.  రెండీటీలోని మధ్యభాగంలో నెలవంక మరియు ఒక నక్షత్రం గుర్తులు ఉంటాయి. కానీ, పాకిస్థాన్ జండాలో ఒక మూలాన నిలువుగా కొంత భాగంలో తెల్ల రంగు ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు కింద గమనించవచ్చు.

చివరిగా, ఈ ఫొటోలో కనిపిస్తున్న జండా పాకిస్తాన్ దేశ జెండా కాదు.

Share.

About Author

Comments are closed.

scroll