Fake News, Telugu
 

చిక్కటి పసుపు/కుంకుమ నీటితో అభిషేకం చేసినప్పుడు విగ్రహం కళ్ళపైన ఏర్పడే పొర వల్ల అవి మూసుకున్నట్లు కనిపిస్తాయి

0

“అభిషేకo జరుగుతుంటే కళ్ళు మూసుకున్న అమ్మవారు” అని చెప్తూ అమ్మవారి విగ్రహానికి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తుండగా కళ్ళు మూసుకున్న అమ్మ వారి విగ్రహం.

ఫాక్ట్: ఈ వీడియోలోని దృశ్యాలు వరంగల్ భద్రకాళీ ఆలయానికి సంబంధించినవి. నీళ్ళు, పాలు, నెయ్యి వంటి పలుచటి పదార్ధాలతో అభిషేకం చేసినప్పుడు విగ్రహం కళ్ళు మామూలుగానే ఉంటాయి. పసుపు లేదా కుంకుమ కలిపిన చిక్కటి నీళ్ళతో అభిషేకం చేస్తే అవి విగ్రహం కంటి పైన ఒక పొర లాగా ఏర్పడటం వల్ల మనకు విగ్రహం కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తుంది. కావున ఈ పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇది వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారి గుడి అని తెలిసింది. ఈ గుడిలోని అమ్మవారి విగ్రహానికి వివిధ సందర్భాలలో జరిగిన అభిషేకం వీడియోలను పరిశీలించాము. ముందుగా నీటితో అభిషేకం చేసినప్పుడు విగ్రహం యొక్క కళ్ళల్లో ఎటువంటి మార్పు లేదు.

పాలు మరియు నెయ్యి వంటి పదార్ధాలతో అభిషేకం చేసినప్పుడు కూడా విగ్రహం కళ్ళు మనకు కనిపిస్తాయి.

అయితే పసుపు లేదా కుంకుమ కలిపిన చిక్కటి నీళ్ళతో అభిషేకం చేసినప్పుడు మనకు విగ్రహం కళ్ళు సరిగ్గా కనిపించవు. దీనికి కారణం, ఈ పదార్ధాలు విగ్రహం కంటి పైన ఒక పొర లాగా ఏర్పడటమే. అందువలన మనకు విగ్రహం కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ, తరువాత నీటితో అభిషేకం చేసినప్పుడు ఈ పొర తొలగిపోయి మళ్ళీ కళ్ళు మాములుగా కనిపిస్తాయి.

ఇక ఇతర దేవాలయాలలో కూడా విగ్రహానికి అభిషేకం జరిగేటప్పుడు కళ్ళు మూసుకున్నట్లు ఉండే వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, చిక్కటి పసుపు/కుంకుమ నీటితో అభిషేకం చేస్తున్నప్పుడు విగ్రహం కంటి పైన పొర ఏర్పడటం వలన కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తుంది.                         

Share.

About Author

Comments are closed.

scroll