బంగ్లాదేశ్‌లోని హిందువులు మరియు ఇతర మైనారిటీలపై, వారి మత స్థలాలపై దాడులకు సంబంధించి పలు వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) వస్తున్న నేపథ్యంలో, ఒక కాళీ మాత విగ్రహం యొక్క తలను కొందరు తీసివేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. “బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్టులు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ, హిందూ దేవతలను ధ్వంసం చేస్తున్నారు.,”అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో కొందరు ముస్లింలు కాళీ మాతా విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఉన్న సుల్తాన్‌పూర్ గ్రామంలోని ఒక కాళీ ఆలయంలో తీసిన వీడియో ఇది. 26 నవంబర్ 2024న జరిగిన ఒక నిమజ్జన కార్యక్రమం కోసం కొందరు భక్తులు కాళీ మాత విగ్రహాన్ని తీసేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఇది అక్కడి ఆచారం. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఈ వీడియో యొక్క మొత్తం వెర్షన్(పొడిగించిన వెర్షన్) మాకు సోషల్ మీడియాలో లభించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఒక నిమజ్జనం కార్యక్రమం కోసం కాళీ మాతా విగ్రహాన్ని తీసే ప్రక్రియను ఈ వీడియో చూపిస్తుంది అని ఈ పోస్టులలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామంలో ఉన్న ఒక కాళీ మాత ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు అయిన, సుల్తాన్‌పూర్ కిరణ్మోయి లైబ్రరీ వారు, ఈ ఈవెంట్ యొక్క విజువల్స్‌ను తమ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశారు.

ఈ ఆధారాలను క్లూ లాగా తీసుకొని, మేము ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఈ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేస్తూ, స్థానిక మీడియా వాళ్లు ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, వైరల్ వీడియోలో మనకు కనిపిస్తున్నది ఒక పురాతన ఆచారం, దీన్ని స్థానిక మోండల్ కుటుంబం వారు అక్క ఉన్న కాళీ మాత ఆలయంలో నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని ఇలా విరగకొట్టి నిమజ్జనం చేస్తారు, ఆ తర్వాత కొత్త విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. 26 నవంబర్ 2024న, ఈ విగ్రహాన్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ముక్కలు ముక్కలుగా విడగొట్టి, సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.

అంతేకాకుండా, ఈ కాళీ దేవాలయానికి చెందిన ఫేస్‌బుక్ ఫోటోలు ఇంకా Google మ్యాప్స్ ఫొటోలను పోల్చి చూడగా, ఈ ఆలయం పశ్చిమ బెంగాల్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఉందని, బంగ్లాదేశ్‌లో లేదని మాకు స్పష్టంగా అర్థం అయ్యింది.

అదనంగా, ఈ విషయం గురించి మరింత సమాచారం కోసం సుల్తాన్‌పూర్ కాళీ పూజ కమిటీ యొక్క ఆర్గనైజింగ్ బాడీ సభ్యుడు దేబాశిష్ మోండల్‌ను మేము సంప్రదించాము. ఆయన మాతో మాట్లాడుతూ, ఈ వీడియోని 26 నవంబర్ 2024న సుల్తాన్‌పూర్ గ్రామంలోని కాళీ ఆలయంలో జరిగిన నిమజ్జనోత్సవం సందర్భంగా తీశారు అని స్పష్టం చేశారు. దీనితో పాటు, ఆ విగ్రహం యొక్క బరువు, పరిమాణం కారణంగా, దాన్ని పూర్తిగా నిమజ్జనం చేయడం కష్టం అవుతుంది కాబట్టి, దాన్ని ముక్కలుగా చేసి నిమజ్జనం చేస్తారు అని ఆయన వివరించారు. అలాగే, ఈ వీడియోలో మతపరమైన కోణం ఉంది అనే వాదనను ఆయన కొట్టిపారేశారు.
చివరిగా, బంగ్లాదేశ్‌లో కాళీ మాతా విగ్రహాన్ని కొందరు ముస్లింలు ధ్వంసం చేసిన సంఘటనకి చెందిన వీడియో అని పశ్చిమ బెంగాల్‌లో తీసిన ఒక సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు.