Fake News, Telugu
 

ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై త్వరలో జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని చెప్తూ “Way2News” కథనం ప్రచురించలేదు

0

25 ఏప్రిల్ 2024న ఉండవల్లిలోని బాబు నివాసంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చంద్రబాబును కలిశారు (ఇక్కడ & ఇక్కడ). అనంతరం మీడియా సమావేశంలో రిజర్వేషన్లపై పీయూష్ గోయల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే “ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై త్వరలో జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారని, మతపరమైన రిజర్వేషన్లకు టీడీపీ వ్యతిరేకం, బీజేపీ నిర్ణయాన్ని మేం కూడా అంగీకరిస్తున్నాం అని చంద్రబాబు అన్నట్లు” – ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం అంటూ ఫోటో(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: “ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై త్వరలో జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు” – ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో తెలిపినట్టుగా, చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై త్వరలో జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చేస్తామని అని అన్నారా? అని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది.

వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే “BJP దెయ్యాల మేనిఫెస్టో చదువుతోంది: చిదంబరం” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఈ వార్త వైరల్ అవడంతో, Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.

అయితే 25 ఏప్రిల్ 2024న విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తుందా అనే ప్రశ్నకు పీయూష్ గోయల్ సమాధానమిస్తూ , రిజర్వేషన్లలో కొత్త అంశాలను చేర్చడాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ,ఎస్సీ ,ఎస్టీ , ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే రిజర్వేషన్లకు తమ పూర్తి మద్దతు ఉంటుంది అని, ఈ నాలుగు వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ల కోసం బీజీపీ అండగా నిలుస్తుందని, ఈ వర్గాల ప్రజలకు ఇచ్చిన రిజర్వేషన్లకు నష్టం కలిగించేలా తెచ్చే ఏ ఇతర రిజర్వేషన్లకు తమ మద్దతు ఉండదని, వాటికీ బీజీపీ వ్యతిరేకం, అలాంటి చర్యలను తాము అనుమతించం అని అన్నారు.

చివరగా, ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై త్వరలో జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారని చెప్తూ “Way2News” కథనం ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll