“2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా బరితెగిస్తుందని, జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరని జొన్నలగడ్డ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు” అని ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోజనసేనకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య విజ్ఞప్తి చేశారు” -‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం.
ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 09 మే 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో తెలిపినట్టుగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య విజ్ఞప్తి చేశారా? అని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది.
ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/g5gze2) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 29 ఏప్రిల్ 2024న “పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?: పవన్ కళ్యాణ్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఈ వార్త వైరల్ అవడంతో, 09 మే 2024న Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.
చివరగా, 2024 ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య విజ్ఞప్తి చేశారని చెప్తూ ‘Way2News’ కథనం ప్రచురించలేదు.