Deepfake, Fake News, Telugu
 

ఈ ఆడియో క్లిప్‌లలో ఉన్న సుప్రియా సూలే, నానా పటోలేల వాయిస్ AI ద్వారా రూపొంచించబడింది

0

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా NCP–SP ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే బిట్ కాయిన్ల విక్రయం ద్వారా ఎన్నికలకు అక్రమంగా నిధులను సమకూరుస్తున్నారని చెప్తూ బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రియా సూలే మరియు నానా పటోలే సారథి అసోసియేట్స్ అనే సంస్థ ఉద్యోగి గౌరవ్ మెహతా, ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ గుప్తాను బిట్ కాయిన్లను మార్చి డబ్బు తెమ్మని ఒత్తిడి చేస్తున్నట్లుగా నాలుగు ఆడియో క్లిప్పులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇవే పోస్టులని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: బిట్ కాయిన్లను మార్చి డబ్బు తెమ్మని గౌరవ్ మెహతా మరియు ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ గుప్తాకు NCP–SP ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే చెప్పిన ఆడియో క్లిప్పులు.

ఫాక్ట్: ఈ క్లిప్‌లలో ఉన్న వాయిస్ తమది కాదని సుప్రియా సూలే, నానా పటోలే పేర్కొన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, ఇవి AI ద్వారా రూపొందించిన ఆడియో క్లిప్‌లని వివిధ AI-డిటెక్షన్ టూల్స్ తో పాటు Deepfakes Analysis Unit (DAU) లోని నిపుణులు కూడా నిర్ధారించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ ఆడియో క్లిప్పులని ఒక్కొక్కటిగా పరిశీలించి అందులోని నిజానిజాలను తెలుసుకుందాం.

ఆడియో క్లిప్-1: గౌరవ్ మెహతాతో సుప్రియా సూలే సంభాషణ

ఈ ఆడియో క్లిప్పులో సుప్రియా సూలే సారథి అసోసియేట్స్ సంస్థలో ఉద్యోగి గౌరవ్ మెహతాని బిట్ కాయిన్లను డబ్బుగా మార్చమని చెప్తున్నట్లుగా ఉంది. ఈ ఆడియో క్లిప్పులోని సుప్రియా సూలే వాయిస్‌ను ఆమె ఇతర సందర్భాలలో మాట్లాడిన వీడియోలతో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) పోల్చగా వైరల్ ఆడియోలో ఆమె వాయిస్ భిన్నంగా, అసహజంగా ఉండటం గమనించవచ్చు. అలాగే, పదాల మధ్యలో ఖాళీ లేకుండా పలకడం కూడా గమించవచ్చు. పైగా, తన పార్టీ జనరల్ సెక్రటరీ అదితి నల్వాడే గురించి ప్రస్తావిస్తున్నప్పుడు వైరల్ ఆడియోలో సుప్రియా ‘అదిటి’ అని తప్పుగా పలకడం కూడా వినవచ్చు. పై ఆధారాలను బట్టి, వైరల్ ఆడియోని  కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించి ఉండవచ్చని తెలుస్తుంది.

ఈ విషయాన్ని ధృవీకరించడానికి వైరల్ ఆడియోని వివిధ AI-డిటెక్షన్ టూల్స్ ద్వారా పరీక్షించగా, ట్రూ మీడియా మరియు హైవ్ వెబ్సైట్లు ఈ ఆడియో సహజమైనది కాదని, ఇది AI ద్వారా రూపొందించబడినదని నిర్ధారించాయి.

అయితే, వైరల్ ఆడియోలోని వాయిస్ తనది కాదని, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇటువంటి దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాల్ని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు, ఎన్నికల సంఘానికి సుప్రియ ఫిర్యాదు చేశారు.

ఆడియో క్లిప్-2: గౌరవ్ మెహతాతో అమితాబ్ గుప్తా సంభాషణ

ఈ ఆడియోలో తనకి రూ. 150 కోట్ల డబ్బుని ఏర్పాటు చెయ్యాలని ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తా గౌరవ్ మెహతాకి చెప్పడం వినవచ్చు. అయితే ఈ ఇందులో అమితాబ్ గుప్తా ‘లక్ష్మి’, ‘భాగ్యశ్రీ’ అనే పేర్లని తప్పుగా పలకడం వినవచ్చు. అలాగే, అమితాబ్ గుప్తా ఇతర సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూలతో (ఇక్కడ & ఇక్కడ) దీన్ని పోల్చగా వైరల్ క్లిప్‌లోని అతని వాయిస్ భిన్నంగా ఉండడం గమనించవచ్చు.

ఇక ఈ ఆడియో క్లిప్‌ని వివిధ AI-డిటెక్షన్ టూల్స్ ద్వారా పరీక్షించగా, ఇది కూడా AI ద్వారా రూపొందించిన ఆడియో అని నిర్ధారించబడింది.

ఆడియో క్లిప్-3: అమితాబ్ గుప్తాతో నానా పటోలే సంభాషణ

ఈ ఆడియోలో కాంగ్రెస్ నేత నానా పటోలే తనకి డబ్బు ఇవ్వాలని అమితాబ్ గుప్తా మరాఠీలో అడగడం వినవచ్చు. ఈ ఆడియో క్లిప్ నిడివి కేవలం ఐదు సెకండ్లు ఉండడంతో దీన్ని ఆయన పాత వీడియోలతో పోల్చడం కుదరలేదు. అయితే, ఈ క్లిప్‌ని వివిధ AI-డిటెక్షన్ టూల్స్ ద్వారా పరీక్షించగా, ఇది కూడా AI ద్వారా రూపొందించిన ఆడియో అయ్యుండొచ్చు అని తెలిసింది. పైగా, ఇది తన వాయిస్ కాదని, తనపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని నానా పటోలే పేర్కొన్నారు (ఇక్కడ & ఇక్కడ).

ఆడియో క్లిప్-4: అమితాబ్ గుప్తాతో గౌరవ్ మెహతా సంభాషణ

ఈ ఆడియోలో గౌరవ్ మెహతా అమితాబ్ గుప్తాతో తాము బిట్ కాయిన్ లావాదేవీలు చేస్తే పట్టుబకుండా ఉండొచ్చని చెప్పడం వినొచ్చు. అయితే ఇందులోని వాయిస్ అసహజమైన రీతిలో ఉండడంతో AI-డిటెక్షన్ టూల్స్ ద్వారా పరీక్షించగా, ఇది కూడా AI ద్వారా రూపొందించిన ఆడియో అని తెలిసింది.

ఫ్యాక్ట్లీ భాగస్వామిగా ఉన్న Deepfakes Analysis Unit (DAU) కూడా AI నిపుణుల సహకారంతో పైన ఉన్న నాలుగు ఆడియో క్లిప్పులను పరీక్షించగా, ఇవన్నీ AI ద్వారా రూపొందించిన ఆడియోలని నిర్ధారణ అయ్యింది.

చివరిగా, బిట్ కాయిన్ల విక్రయం విషయంలో సుప్రియా సూలే మరియు నానా పటోలే గౌరవ్ మెహతా మరియు ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ గుప్తాతో జరిపిన సంభాషణలు AI ద్వారా రూపొంచించినవి.

Share.

About Author

Comments are closed.

scroll