Fake News, Telugu
 

చైనాలో జరిగిన పాత సంఘటనను రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలంటున్నారు

0

తాజాగా రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన నేపథ్యంలో, రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియో 2015లో చైనాలో జరిగిన సంఘటనకు సంబంధించింది; తాజాగా రష్యా ఉక్రెయిన్‌పై జరిపిన సైనిక చర్యతో దీనికి సంబంధంలేదు. చైనా నగరమైన టియాన్జిన్ లో చట్టవిరుద్ధంగా పనిచేస్తోన్న రసాయనాల గోదాము వలన భారీ పేలుళ్లు జరిగాయి. 170 మందికి పైగా చనిపోయారు, మరియు సుమారు 1.1 బిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం జరిగింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో బీబీసీ న్యూస్ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో 2015లోనే అప్లోడ్ చేసారు. చైనా నగరమైన టియాన్జిన్ లో జరిగిన రెండు భారీ పేలుళ్ళ విజువల్స్ ప్రత్యక్ష సాక్షి చేత తీయబడిందని యూట్యూబ్‌ వీడియో యొక్క వివరణ తెలిపారు.

12 ఆగష్టు 2015న టియాన్జిన్ లో భారీ పేలుళ్లు జరిగాయి. చైనాలో దశాబ్దాలలో జరిగిన అతి ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది ఒకటి. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం, 170 మందికి పైగా చనిపోయారు, మరియు సుమారు 1.1 బిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం జరిగింది. ఈ పేలుళ్లు బలమైన రాజకీయ సంబంధాల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా చట్టవిరుద్ధంగా పనిచేస్తోన్న రసాయనాల గోదాము వలన జరిగింది.

చివరగా, చైనాలో జరిగిన పాత సంఘటనను పట్టుకొని రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll