Fake News, Telugu
 

ఢిల్లీలో జరిగిన శివ గుర్జర్‌ అనే వ్యక్తి హత్యకు సంబంధించి మతపరమైన కోణమేది లేదు

0

ఇటీవల ఢిల్లీలో శివ గుర్జర్‌ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. పోస్టులో శివ గుర్జర్‌ను ముస్లిం మతానికి చెందిన వారు హత్య చేసారంటూ ఈ వార్తని మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీలో శివ గుర్జర్‌ అనే హిందూ వ్యక్తిని ముస్లిం మతానికి చెందినవారు హత్య చేసారు.

ఫాక్ట్ (నిజం): శివ గుర్జర్‌ బైక్ తగలడం వల్ల గొడవ మొదలై, చివరికి హత్యకు దారితీసిందే తప్ప ఈ హత్యలో మతపరమైన ఉద్దేశం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేసారు. శివ గుర్జర్‌పై దాడి చేసిన ఐదుగురిలో (ధర్మేందర్ రాయ్, సచిన్ రాయ్, రామానుజ్ రాయ్, వకీల్ అహ్మద్‌ మరియు ఒక మైనర్ వ్యక్తి) ఒక ముస్లిం ఉన్నప్పటికీ, శివ గుర్జర్‌ను కత్తితో పొడిచి, అతని మరణానికి కారణమైంది మాత్రం హిందూ అయిన ఒక మైనర్ వ్యక్తి. పోలీసులు ఇదే విషయం స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన శివ గుర్జర్‌ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన వార్తా కథనాల ప్రకారం 18 మార్చ్ 2022 రాత్రి వకీల్ అహ్మద్ అనే పాన్ షాప్‌లో పని చేసే వ్యక్తికి శివ గుర్జర్‌ బైక్ తగలడంతో గొడవ మొదలైంది, ఈ క్రమంలోనే వకీల్ అహ్మద్‌తో పాటు పాన్ షాప్‌ యజమాని ధర్మేందర్ రాయ్, అతని కుమారులు సచిన్ రాయ్, రామానుజ్ రాయ్ మరియు పాన్ షాప్‌ యజమాని బంధువైన ఒక మైనర్ వ్యక్తి, మొత్తం ఐదుగురు శివ గుర్జర్‌పై దాడి చేసారు. ఆ గొడవ చివరికి శివ గుర్జర్‌ హత్యకు దారితీసింది.

ఐతే శివ గుర్జర్‌పై పైన తెలిపిన ఐదుగురు దాడి చేసినప్పటికీ, కత్తితో పొడిచి అతని మరణానికి కారణమైంది మాత్రం హిందూ అయిన ఒక మైనర్ వ్యక్తి. కేవలం చిన్న గొడవ హత్యకు దారి తీసిందని, అంతేగాని హత్యకు సంబంధించి మతపరమైన కొనమేది లేదని, పోలీసులు ఆ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తా పత్రికలు రిపోర్ట్ చేసాయి.

ఢిల్లీ వెస్ట్ DCP ఈ హత్యకు సంబంధించి వివరణ ఇస్తూ, ఇందులో మతపరమైన కోణమేది లేదని స్పష్టం చేసాడు. ఈ ఘటనకు సంబంధించి హత్యకు గురైన వ్యక్తి మరియు హత్య చేసిన వ్యక్తి ఇద్దరు ఒకే మతానికి చెందినవారని కూడా DCP స్పష్టం చేసాడు.

పైన తెలిపిన వివరాల ప్రకారం శివ గుర్జర్‌పై దాడి చేసిన ఐదుగురిలో ఒక ముస్లిం వ్యక్తి ఉన్నప్పటికీ, శివ గుర్జర్‌ను అతను పొడవలేదని, పొడిచిన వ్యక్తి కూడా హిందూ మతానికే చెందిన వాడని స్పష్టమవుతుంది.

చివరగా, ఢిల్లీలో జరిగిన శివ గుర్జర్‌ అనే వ్యక్తి హత్యకు సంబంధించి మతపరమైన కోణమేది లేదు.

Share.

About Author

Comments are closed.

scroll