Fake News, Telugu
 

హౌరా GRP పోలీస్ స్టేషన్‌లో ఒక దొంగ ఖర్జూరంలో మత్తుమందు మాత్రలు ఎలా పెడుతారని చూపిస్తున్న దృశ్యాలను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

0

Update (22 January 2025):

“ముస్లింలను క్రైస్తవులను చంపేందుకు ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ కొత్త ప్లాన్ వేశాయి, రంజాన్‌లో ముస్లింలను ఖర్జూరాలతో చంపేందుకు ప్లాన్ చేశాయి” అంటూ ఓ వీడియోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). కానీ, ఈ వైరల్ వీడియో క్రింద వివరించినట్టు, 11 జనవరి 2024న, హౌరా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్ నంబర్ 7 వద్ద  రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలు చేసే దొంగలను హౌరా రైల్వే పోలీసులు పట్టుకున్న తర్వాత, ఆ ముఠాలోని ఓ వ్యక్తి ఖర్జూరంలో మత్తు మాత్రలు ఎలా పెడుతారో పోలీసులకు చూపిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

Published (20 January 2025):

ఖర్జూరలలో పిల్లలు పుట్టకుండా వుండే మందులను పెట్టి హిందువులకు అమ్ముతున్న మతోన్మాద ముస్లింలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఓ వ్యక్తి ఖర్జూరంలో మందు బిళ్ళలను పెట్టడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిం వ్యాపారులు పిల్లలు పుట్టకుండా వుండే (నపుంసకత్వం కలిగించే) మందులను ఖర్జూరలలో పెట్టి హిందువులకు హిందువులకు విక్రయిస్తున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): 11 జనవరి 2024న, హౌరా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్ నంబర్ 7 వద్ద  రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలు చేసే దొంగలను హౌరా రైల్వే పోలీసులు పట్టుకున్న తర్వాత, ఆ ముఠాలోని ఓ వ్యక్తి  ఖర్జూరంలో మత్తు మాత్రలు ఎలా పెడుతారో పోలీసులకు చూపిస్తున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది. ఈ కేసులో నమోదైన  FIR ప్రకారం నిందితుల పేర్లు శంబ్రు పాశ్వాన్, గోవింద్ కుమార్, మహ్మద్ ఇర్ఫాన్‌. అలాగే హౌరా రైల్వే పోలీసులు మాతో మాట్లాడుతూ, ఈ దొంగలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేయడం లేదని, వారు ఉపయోగించిన మాత్రలు నపుంసకత్వం కలిగించేవి కాదని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను (ఆర్కైవ్డ్ లింక్)  ‘తాజా టీవీ (Taaza TV) ’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ 13 జనవరి 2025న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో పశ్చిమ బెంగాల్, హౌరాకు సంబంధించినది. హౌరా రైల్వేస్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలు చేసే దోపిడీ ముఠాను పట్టుకుంది. వారు ఖర్జూరంలో డ్రగ్స్/మత్తు మందులను ఎలా పెడుతారో పోలీసులకు చూపిస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇదే వివరణతో ఇదే వైరల్ వీడియోను షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడఇక్కడఇక్కడ).

ఈ వీడియోను గురించి మరింత సమాచారం కోసం ఇదే వీడియోను షేర్ చేసిన ‘ది లోకల్ జర్నలిస్ట్’ అనే కోల్‌కతా స్థానిక న్యూస్ సంస్థ చెందిన రిపోర్టర్‌ని మేము సంప్రదించాము. మాతో మాట్లాడుతూ, ‘’ది లోకల్ జర్నలిస్ట్’ రిపోర్టర్ ఈ వీడియో హౌరా GRP పోలీసు స్టేషన్ లో తీసింది అని పేర్కొన్నారు. హౌరా GRP పోలీసులు రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలు చేసే దోపిడీ ముఠాను పట్టుకున్న తర్వాత, ఆ ముఠాలోని ఓ వ్యక్తి   ఖర్జూరంలో మత్తు మాత్రలు ఎలా పెడుతారో పోలీసులకు చూపిస్తున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది అని స్పష్టం చేశారు.

ఈ సమాచారం ఆధారంగా మేము పశ్చిమ బెంగాల్ పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి నమోదు చేయబడిన FIR కాపీని మేము పరిశీలించాము. FIR ప్రకారం, 11 జనవరి 2025న, హౌరా రైల్వే స్టేషన్ పాత కాంప్లెక్స్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 7 వద్ద ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. వారు రైలు ప్రయాణికులకు ఖర్జూరలలో మత్తు మాత్రలు (Ativan 2 mg) కలిపి ఇచ్చి  రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్నారు. అలాగే FIRలో నిందితుల పేర్లు శంబ్రు పాశ్వాన్, గోవింద్ కుమార్, మహ్మద్ ఇర్ఫాన్‌లుగా పేర్కొన్నారు. ఈ ఘటనలో నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

తదుపరి ఈ సంఘటన సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి మేము హౌరా GRP పోలీస్ స్టేషన్‌ని కూడా సంప్రదించాము . మాతో మాట్లాడుతూ, హౌరా GRP పోలీసు అధికారులు ఈ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని స్పష్టంచేశారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి దొంగ అని. ఈ దొంగల ముఠా  రైళ్లలో ప్రయాణికులకు మత్తులో మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి దోపిడీలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే,ఈ దొంగలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేయడం లేదని, వారు ఉపయోగించిన మాత్రలు నపుంసకత్వం కలిగించేవి కాదని వారు స్పష్టం చేశారు.

చివరగా, ఈ వైరల్ వీడియో హౌరా GRP పోలీస్ స్టేషన్‌లో ఖర్జూరంలో మత్తు మాత్రలు ఎలా పెడుతారని ఒక దోపిడీ ముఠా సభ్యుడు పోలీసులకు చూపిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll