Fake News, Telugu
 

మదురైలోని మహిళా కళాశాలల దగ్గర యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోని మతపరమైన కథనంతో తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తమిళనాడులోని మహిళా కళాశాల బయట ముస్లిం అబ్బాయిలు హిందూ బాలికలను ఈవ్ టీజింగ్ చేస్తూ, కూతురిని పికప్ చేసేందుకు వచ్చిన ఒక తండ్రిపైన దాడికి పాల్పడ్డ దృశ్యాలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడులోని ఒక మహిళా కళాశాల ముందు ముస్లిం అబ్బాయిలు హిందూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్‌లోని వీడియో తమిళనాడులోని మదురైలో ఉన్న లేడీ డాక్ కళాశాల మరియు శ్రీ మీనాక్షి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు సంఘటనల దృశ్యాలను చూపుతుంది. మదురై పోలీసులు ఈ రెండు ఘటనల్లో నిందితులుగా ఉన్న యువకులందరినీ అరెస్టు చేసి, వారి వివరాలను ఫేస్‌బుక్ పోస్ట్‌ల ద్వారా షేర్ చేసారు. ఈ రెండు ఘటనల్లోని నిందితుల్లో ఎవరూ ముస్లిం కాదు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్ట్‌లో ఉన్న వీడియోలో రెండు వేర్వేరు వీడియో క్లిప్‌లు ఉన్నాయి. ఒక్కో వీడియోలోని వివరాలను ఇక్కడ చూద్దాం.

వీడియో క్లిప్ 1:

వీడియోలోని స్క్రీన్‌షాట్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చెయ్యగా, 03 నవంబర్ 2022న ‘తంతి టీవీ’ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన ఇలాంటి విజువల్స్‌తో కూడిన వీడియో లభించింది. ఈ ఛానెల్ వారు ఈ వీడియోని కొందరు యువకులు, మహిళా కళాశాలలోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలుగా రిపోర్ట్ చేసారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’  వెబ్‌సైట్ 05 నవంబర్ 2022న ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం 30 అక్టోబర్ 2022న, తేవర్ జయంతి సందర్భంగా లేడీ డోక్ కాలేజీలోకి బలవంతంగా ప్రవేశించి విద్యార్థులను వేధించిన తొమ్మిది మంది యువకులను మధురై నగర పోలీసులు అరెస్టు చేశారు.

మదురై పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను, నిందితుల అరెస్టును తెలియజేస్తూ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ను ప్రచురించారు. ఈ ఘటనపై తాళ్లకుళం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో పాల్గొన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నామని మదురై పోలీసులు తెలియజేశారు. మదురై పోలీసులు పది మంది నిందితుల పేర్లను సూర్య, ముత్తు నవేష్, అరుణ్‌ పాండియన్, మణికందన్, సేతుపాండి, మణికందన, పెరల్ విఘ్నేష్, విలియం ఫ్రాన్సిస్, విమల్‌జాయ్ ప్యాట్రిక్, అరుణ్ అని పేర్కొన్నారు.

వీడియో క్లిప్ 2:

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, 05 నవంబర్ 2022న ‘టైమ్స్ నౌ’ ప్రచురించిన కథనంలో ఇలాంటి విజువల్స్ కనిపించాయి . మదురైలోని శ్రీ మీనాక్షి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ముందు యువకుల గుంపు ఒక విద్యార్థి తండ్రిపై దాడి చేసిన దృశ్యాలుగా ‘ టైమ్స్ నౌ ’ రిపోర్ట్ చేసింది. వార్తా కథనాల ప్రకారం, శ్రీ మీనాక్షి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి తన కుమార్తెను తీసుకెళ్లడానికి వచ్చిన తండ్రిపై ఒక యువకుల గుంపు దాడి చేసింది. ఒక అంత్యక్రియల ఊరేగింపును అనుసరిస్తుండగా బాలికల ముందు చేసిన తప్పుడు ప్రవర్తనను ప్రశ్నించినందుకు వారు ఆ తండ్రిపై దాడి చేసారు. ఈ దాడిలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులను మదురై పోలీసులు తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం మరియు ఇతర సెక్షన్ల కింద అరెస్టు చేశారు.

04 నవంబర్ 2022న జరిగిన ఈ ఘటనలో పాల్గొన్న నిందితుల వివరాలను మదురై పోలీసులు ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా షేర్ చేసారు. మదురై పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు యువకుల పేర్లను సతీష్ కుమార్, రామమూర్తి, నవీన్ అలియాస్ నాగపిరియన్, అజిత్ కుమార్, సోమసుందరన్, శివగణం అని వివరించారు. మధురై పోలీసులు పేర్కొన్న నిందితుల పేర్లు మరియు వారి తండ్రి పేర్లను పరిశీలిస్తే, ఈ కేసుల్లో నిందితుల్లో ఎవరూ ముస్లిం కాదని తెలుస్తుంది.

ఈ రెండు కేసుల ఎఫ్‌ఐఆర్ కాపీలు ప్రస్తుతం తమిళనాడు పోలీసు వెబ్‌సైట్‌లో బ్లాక్ చేయబడ్డాయి.  మహిళా కళాశాలల ముందు యువత చేస్తున్న ఈ వికృత చేష్టలపై మదురై డిప్యూటీ కమిషనర్ ఎన్.మోహన్ రాజా మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవల నగరంలోని మహిళా కళాశాలల ముందు యువత సృష్టించిన గొడవల నేపథ్యంలో తప్పుగా ప్రవర్తించిన యువకుల తల్లిదండ్రులకు వారి పిల్లలతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వబడుతుంది.” అని తెలిపారు. మదురైలోని ఈ మహిళా కళాశాలల వెలుపల జరిగిన ఈ గొడవలలో పాల్గొన్న యువకులు ముస్లింలు అని ఎక్కడా రిపోర్టు కాలేదు.

చివరిగా, మధురైలోని మహిళా కళాశాలల ముందు కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోని తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll