2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లని (EVMలను) వ్యాన్‌లో దొంగలించి తీసుకెళ్తున్న బీజేపీ కార్యకర్తలు అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, మధ్య ప్రదేశ్‌లోఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లని (EVMలను) వ్యాన్‌లో దొంగలించి తీసుకెళ్తున్న బీజేపీ కార్యకర్తలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని సంఘటన 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారణాసిలో జరిగింది, 2024 మధ్య ప్రదేశ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధం లేదు. వాహనంలో తీసుకెళ్తున్న EVMలు అధికారుల శిక్షణ కోసం వాడే ట్రైనింగ్ EVMలని, అవి ఎన్నికలలో ఉపయోగించినవి కాదని సీఈవో ఆఫీస్ (ఉత్తరప్రదేశ్), వారణాసి డీఎం స్పష్టం చేసారు. అంతేకాక, EVMలపై ఉన్న పసుపు రంగు స్టిక్కర్ల మీద ‘Training/Awareness EVM’ అని పేర్కొని ఉంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఇదే సంఘటనకు సంబంధించి ఎక్కువ నిడివితో ఉన్న వీడియో లభించింది. ఈ వీడియోను 8 మార్చ్ 2022న ఒక సోషల్ మీడియా యూసర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. ఆ పోస్టులో ఈ సంఘటన వారణాసిలో జరిగినట్టు పేర్కొన్నారు.
ఈ సమాచారంతో ఇంటర్నెట్‌లో వెతికితే ఈ సంఘటనకు సంబంధించి ఎన్డీటీవీ 8 మార్చ్ 2022న ప్రచురించిన వీడియో రిపోర్ట్ లభించింది. ఈ రిపోర్టులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓట్లను లెక్కించే రెండు రోజుల ముందు వారణాసిలోని ఒక కౌంటింగ్ సెంటర్ నుండి బీజేపీ ప్రభుత్వం EVMలను దొంగిలించిందని ఆరోపించారు.
అయితే, ఓట్లను లెక్కించే అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్తున్న ట్రైనింగ్ EVMలను కొంతమంది రాజకీయ నాయకులు ఆపి ఇవి ఎన్నికలలో వినియోగించిన EVMలు అని ప్రచారం చేస్తున్నారని, ఈ EVMలను కేవలం అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారని CEO ఆఫీస్ (ఉత్తర్ ప్రదేశ్) మరియు వారణాసి DM స్పష్టం చేసారు.
అంతేకాక, ఈ సంఘటనకు సంబంధించి మాకు లభించిన పూర్తి వీడియోలో కూడా EVMలపై ఉన్న పసుపు రంగు స్టిక్కర్ల మీద ‘Training/Awareness EVM’ అని ఉండడం గమనించాం. ‘మాన్యువల్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అండ్ VVPAT’ (2020) డాక్యుమెంట్‌లో, ‘ట్రయినింగ్ మరియు అవేర్‌నెస్’ అనే చాప్టర్ కింద, “అలాంటి EVMలు మరియు VVPATలపై “‘ట్రయినింగ్/ అవేర్‌నెస్’” అని ఉండే పసుపు రంగు స్టిక్కర్‌ను అతికించండి” అని పేర్కొన్నారు.
ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ వారి కథనంలో అఖిలేష్ యాదవ్ EVMలను అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్తుంటే, ఆ విషయాన్ని ఎన్నికలలో పాల్గొన్న అభ్యర్థులకు ఎందుకు ముందే చెప్పలేదని ప్రశ్నించారు. ‘మాన్యువల్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మరియు VVPAT’ (2019) డాక్యుమెంట్ ప్రకారం, “(iii) వేర్‌హౌస్ నుండి ఈవీఎంలు/వీవీప్యాట్‌లను శిక్షణ మరియు అవగాహన కోసం బయటకు తీస్తే, వేర్‌హౌస్‌ని తెరిచి మరియు సీల్ చేసే ప్రక్రియను చూసేందుకు రాజకీయ పార్టీలను తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీయాలి. (iv) అటువంటి EVMలు మరియు VVPATల జాబితాను జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇవ్వబడుతుంది. అభ్యర్థులు/వారి ఏజెంట్లు ఖరారు అయ్యాక ఈ జాబితాను వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. (v) అవగాహన/శిక్షణ షెడ్యూల్ కి సంబంధించిన వివరాలను గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఇస్తారు.” EVMల శిక్షణ/అవేర్‌నెస్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ డాక్యుమెంట్‌లో చూడవచ్చు.
ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం వారణాసి కమీషనర్ దీపక్ అగర్వాల్ కూడా EVMలను తరలించే ప్రోటోకాల్ లో లోపం జరిగినట్టు అంగీకరించారు. కానీ, అవి అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన EVMలు కాదని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయం ఫై ఆయన మాట్లాడిన వీడియోను సమాజ్ వాదీ పార్టీ చేసిన ట్వీట్ లో చూడవచ్చు. అంతేకాక, EVMలను తరలించే ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు EVM ఇన్‌ఛార్జ్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నళినీ కాంత్ సింగ్‌ను ECI సస్పెండ్ చేసినట్టు వార్తా కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చూడవచ్చు.
చివరగా, 2022లో వారణాసిలో ట్రైనింగ్ EVMల తరలింపును అడ్డుకున్న వీడియోను 2024 లోక్ సభ ఎన్నికలలో మధ్య ప్రదేశ్‌లో EVMలను దొంగిలిస్తున్న బీజేపీ కార్యకర్తలు అని షేర్ చేస్తున్నారు.