ఒక సోషల్ మీడియా పోస్టులో శవాలతో రద్దీగా ఉన్న స్మశాన వాటిక వీడియో పెట్టి, అది నాసిక్ మహారాష్ట్ర లో పరిస్థితిగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూదాం.
క్లెయిమ్: శవాలతో రద్దీగా ఉన్న స్మశాన వాటిక వీడియో నాసిక్, మహారాష్ట్ర కు చెందింది.
ఫాక్ట్: పోస్టులో ఉన్న వీడియో సూరత్, గుజరాత్ లోని ఉమ్రా స్మశాన వాటికకు చెందింది. శవాలతో రద్దీగా ఉన్న ఈ స్మశాన వాటికకు నాసిక్, మహారాష్ట్రకు సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, యూట్యూబ్ లో ఇదే వీడియోని నేషన్ నెక్స్ట్ వారు పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియో వివరణలో, ఇది సూరత్ ప్రాంతం లో తీయబడిందని, మృతదేహాలు అలా లైన్ లో ఉండటం కవిడ్ -19 యొక్క తీవ్రతని తెలియజేస్తుందని, అందులో గుజరాతిలో మాట్లాడుతున్న వ్యక్తి ఆసుపత్రి వారు జనాలకు టోకెన్లు ఇస్తున్నారని వివరించారు.
సూరత్ స్మశాన వాటిక అని గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు, ‘గుజరాత్ ఎక్సక్లూసివ్’ ఆర్టికల్ లో దీని గురించి వివరించారు. ఈ వీడియో ఉమ్రా అనే స్మశాన వాటికకు సంబంధించిందని, సూరత్ లో రోజు రోజుకి మరణాల సంఖ్య పెరగటంతో అక్కడ స్మశాన వాటికలు ఇలా రద్దీగా మారాయని వారి ఆర్టికల్ లో వివరించారు.
ఈ వీడియోకు సంబంధించి మరిన్ని న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, గుజరాత్ లోని స్మశాన వాటిక వీడియోను పెట్టి నాసిక్ నుంచి అని తప్పుగా షేర్ చేస్తున్నారు.