మెడలో చెప్పుల దండ వేసి ఉన్న ఒక వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఆ వ్యక్తి బంగ్లాదేశ్‌లో నివసించే ఒక హిందూ ఉపాధ్యాయుడని, ఎన్ని సార్లు చెప్పినా కూడా తను ఇస్లాం మతంలోకి మారడం లేదనే కారణంతో, ఒక మదర్సాలో చదువుకొనే కొందరు శాస్త్రవేత్తలు ఈ విధంగా తనతో వ్యవహరించారని సోషల్ మీడియా యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఉపాధ్యాయుడు ఇస్లాం మతంలోకి మారడం లేదని కొందరు ముస్లింలు చెప్పుల దండ వేసి అవమాన పరిచారు, దానికి సంబంధించిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు అహ్మద్ అలీ. 15 జూన్ 2025న ముహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో రిటైర్డ్ డాక్టర్ అయిన అహ్మద్ అలీపై కొందరు దాడి చేసి చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటనకు చెందిన వీడియో ఇది. కాబట్టి, ఈ పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి అందులోని కీఫ్రేమ్‌లను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దానికి సంబంధిచిన అనేక బంగ్లాదేశీ మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 15 జూన్ 2025న బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలోని బాలియాకండి ఉపజిల్లాలో ఉన్న బెరులి బజార్‌లో జరిగింది.

టెకాటి అనే గ్రామానికి చెందిన ఒక రిటైర్డ్ కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్ అయిన అహ్మద్ అలీ అనే వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో స్థానికంగా ఉన్న ఒక టీ దుకాణంలో ఒక గుంపు తనపై దాడి చేసిందని ఈ వార్తా కథనాల్లో ఉంది (ఇక్కడ, ఇక్కడ). ఆ తర్వాత అతనికి ఒక షూ/చెప్పుల దండ వేసి ఊరేగించారు. పోలీసులు మరియు సైనిక సిబ్బంది జోక్యం చేసుకుని, ఆయనను రక్షించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అదనంగా, ఈ వీడియోని ఉద్దేశిస్తూ, బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడి ప్రెస్ విభాగం, 29 జూన్ 2025న చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ (ఆర్కైవ్) కూడా మేము కనుగొన్నాము. వైరల్ క్లెయిమ్ ఫేక్ అని, ముస్లింలు ఒక హిందూ ఉపాధ్యాయుడికి షూ దండ వేసి, దాడి చేశారనే వాదన తప్పు అని ఈ పోస్ట్ ద్వారా వారు స్పష్టం చేశారు. ఇది హిందూ సమాజంపై జరిగిన మతపరమైన హింసను చూపిస్తున్న వీడియో కాదని ఈ పోస్ట్ ద్వారా వారు తెలిపారు.

చివరగా, ముహమ్మద్ ప్రవక్తపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో, బంగ్లాదేశ్‌లో ఒక రిటైర్డ్ వైద్యాధికారిపై జరిగిన దాడి వీడియోను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.