కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణమని మహిళలు ఒకే సారి గుంపులుగా తోసుకుంటూ బస్సు ఎక్కడంతో ఒక మహిళ తోపులాటలో పడిపోయి చేయి విరగొట్టుకుందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం యొక్క ఫలితాలివంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉచిత బస్సు ప్రయాణమని కర్ణాటకలోని మహిళలు తోసుకుంటూ ఒక బస్సు ఎక్కడంతో ఒక మహిళ తోపులాటలో పడిపోయి చేయి విరగొట్టుకున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని మహిళ ప్రయాణిస్తున్న బస్సుని లారీ ఢీ కొట్టడంతో ఆమె తన చేయి పొగిట్టుకుంది. 18 జూన్ 2023 నాడు కర్ణాటక రాష్ట్రం నంజన్‌గుడ నుండి టి. నరసిపురా టౌన్‌కి వెళ్తున్న ఒక KSRTC బస్సుని మితిమీరిన వేగంతో వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. అతివేగంతో వచ్చిన ఈ లారీ బస్సు కుడి వెనుక కిటికీని ఢీ కొట్టడంతో కిటికీ పక్కన కూర్చున్న ఒక మహిళ చేయి విరిగిందని, మరొక మహిళ కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయని KSRTC ట్వీట్ చేసింది. బస్సు ఎక్కుతూ తోపులాటలో పడిపోయి ఈ మహిళ తన చేతిని విరగొట్టుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ ఘటనకు సంబంధించి ‘కన్నడ ప్రభ’ వార్తా సంస్థ 25 జూన్ 2023 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని హుళ్లెన్‌హళ్లి గ్రామ సమీపంలో లారీ-బస్సు ఢీకొనడంతో బస్సులోని మహిళ ప్రయాణికురాలు ఒకరు తన చేయి పోగొట్టుకుందంటూ ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అతివేగంతో వచ్చిన ఒక లారీ, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పొర్ట్ కార్పొరేషన్‌కు (KSRTC) చెందిన బస్సుని ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేయి పోగొట్టుకుందని ఈ వార్తా సంస్థ తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి KSRTC సంస్థ 25 జూన్ 2023 నాడు ఒక ట్వీట్ పబ్లిష్ చేసింది. 18 జూన్ 2023 నాడు కర్ణాటక రాష్ట్రం నంజన్‌గుడ నుండి టి. నరసిపురా టౌన్‌కి వెళ్తున్న KSRTC బస్సుని, మితిమీరిన వేగంతో వచ్చిన ఒక లారీ ఢీకొట్టిందని KSRTC తెలిపింది. అతివేగంతో వచ్చిన ఈ లారీ బస్సు కుడి వెనుక కిటికీని ఢీ కొట్టడంతో కిటికీ పక్కన కూర్చున్న ఒక మహిళ చేయి విరిగిందని, మరొక మహిళ కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయని KSRTC తమ ట్వీట్లో తెలిపారు.
బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నమాని, వారి చికిత్సకు కావలిసిన మొత్తం డబ్బుని KSRTC భరిస్తుందని ఈ ట్వీట్లో తెలిపారు. అంతేకాదు, ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవరుపై బిలిగేరే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు KSRTC తెలిపింది. కిటికీ నుండి బస్సులోకి ఎక్కే ప్రయత్నంలో మహిళ చేయి పోగొట్టుకుందని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వదంతులని నమ్మకూడదని KSRTC తమ ట్వీట్లో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బిలిగేరే పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్‌ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, కర్ణాటకలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులోని మహిళ ప్రయాణికురాలు చేయి పోగొట్టుకున్న వీడియోని కర్ణాటక శక్తి యోజనకు (ఉచిత బస్సు ప్రయాణం స్కీం) జత చేస్తు తప్పుగా షేర్ చేస్తున్నారు