అర్థరాత్రి పిల్లల కోసం పులి ఎలా వెతుకుతుందో చుడండి, అని క్లెయిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల నంద్యాలలో నాలుగు పెద్దపులి పిల్లలు లభించాయి, అటవీ శాఖ అధికారులు Operation Mother Tiger చేపట్టి ఈ పిల్లలని తల్లి పులి దగ్గరకు చేర్చటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఐతే, ఈ సందర్భంలో సోషల్ మీడియాలో నల్లమల్లలో తల్లి పులి తన పిల్లలను వెతుకుతున్న వీడియోగా ఈ వీడియో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: నల్లమల్లలో తప్పిపోయిన పిల్లల కోసం అర్థరాత్రి వేళ వెతుకుతున్న తల్లి పులి వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో జనవరి 2023లో రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న మాలాఖేడా రైల్వే స్టేషన్ దగ్గర చిరుతపులి గోడపై నడుస్తూ కనిపించినప్పుడు తీసినది. ఈ వీడియోకి, ఇటీవల నంద్యాలలో లభించిన పెద్దపులి పిల్లలకి సంబంధం లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలో కొన్ని స్క్రీన్ షాట్స్ InVid టూల్ ద్వారా పొంది వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, వీడియోలోని దృశ్యాలు, స్క్రీన్ షాట్లు కలిగిన వార్తా కథనాలు లభించాయి.
ఈ ఏడాది జనవరి 21న ETV Bharatలో ప్రచురితమైన కథనం ప్రకారం, రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో ఉన్న మాలాఖేడాలో ఈ సంఘటన జరిగింది. ఒక చిరుతపులి మాలాఖేడాలోని రైల్వే స్టేషన్ దగ్గర ప్రత్యక్షమైంది. అప్పుడు ఈ వీడియో వైరల్ కూడా అయింది. కానీ, అటవీ శాఖ వారు అక్కడికి చేరుకొనే సరికి ఆ చిరుతపులి ఆచూకీ దొరకలేదు. ఇదే వీడియోకు సంబంధించిన సమాచారంపై ప్రచురించిన వారు కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
ఈ పాత వీడియోను, ఇటీవల నల్లమల్లలో తల్లి నుండి తప్పిపోయిన నాలుగు పెద్దపులి పిల్లల కథనంతో ముడిపెట్టి తప్పుగా షేర్ చేస్తున్నారు. వాస్తవానికి, ఈ సంఘటనలో పెద్దపులి ఆచుకీ దొరకకపోవటంతో , ఆ నాలుగు పులి పిల్లలని తిరుపతి జూకి తరలించారు.
చివరిగా, ఈ వీడియోలో గోడపై నడుస్తున్న జంతువు పెద్ద పులి కాదు, చిరుతపులి. రాజస్థన్‌లోని మాలాఖేడాలో తీసిన ఈ వీడియోని నల్లమల్ల అని తప్పుగా షేర్ చేస్తున్నారు.