ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనల్లో రోహింగ్యా ముస్లింలు పంజాబ్ సిక్కు రైతులుగా వేషం మార్చుకొని పాల్గొంటున్నారు, వీరు ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తున్నారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా ఒక ముస్లిం వ్యక్తి తన టోపీని తీసి సిక్కు తలపాగా ధరిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలలో ఒక ముస్లిం వ్యక్తి తన టోపీని తీసి సిక్కు తలపాగా ధరించి పంజాబ్ సిక్కు రైతుగా వేషం మార్చుకొని పాల్గొంటున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలలో ముస్లిం వ్యక్తులు తమ వేషధారణ మార్చుకొని పంజాబ్ సిక్కు రైతుల లాగా నిరసనలలో పాల్గొన్నారని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఈ వైరల్ వీడియో జూన్ 2022న మాన్సాలోని బహరాలీ అనాజ్ మండిలో జరిగిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా యొక్క అంతిమ్ అర్దాస్ (చివరి ప్రార్థన) పాల్గొనేందుకు ఒక ముస్లిం వ్యక్తి తన టోపీని తీసి సిక్కు తలపాగా ధరిస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా మేము ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలో ఇలా ముస్లిం వ్యక్తులు తమ వేషధారణ మార్చుకొని పంజాబ్ సిక్కు రైతుల లాగా నిరసనల్లో పాల్గొన్నారా అని ఇంటర్నెట్‌లో వెతకగా , మాకు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు, ఒక వేళ ఇలాంటి సంఘటన చోటు చేసుకొని ఉంటే మీడియా ఖచ్చితంగా రిపోర్ట్ చేసేది.
ఆ తర్వాత మేము ఈ వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం, దీని స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని సర్దారియన్ ట్రస్ట్ పంజాబ్ (Sardarian Trust Punjab) అనే ఫేస్‌బుక్ పేజీలో 10 జూన్ 2022న షేర్ చేసినట్లు తెలిసింది. వీడియో వివరణలో “ సిద్ధూ మూసేవాలా యొక్క చివరి ప్రార్థనలో సర్దరియన్ ట్రస్ట్ తలపాగాలను ఎంకరేజ్ చేసింది, ముస్లిం మరియు హిందూ సోదరులు మేము కూడా అంటూ తలపాగాలను ధరించారు” అని పంజాబీలో రాశారు.
ఈ సిద్ధూ మూసేవాలా యొక్క చివరి ప్రార్థన గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, పలు రిపోర్ట్స్ (ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ) లభించాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం “పంజాబ్‌కు చెందిన సింగర్ సిద్ధూ మూసేవాలా 29 మే 2022లో మాన్సా జిల్లాలోని జవహర్కేలో జీపులో ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు. అయిన కుటుంబ సభ్యులు సిద్ధూ యొక్క అంతిమ్ అర్దాస్ (చివరిప్రార్థన) మాన్సాలోని బహరాలీ అనాజ్ మండిలో 08 జూన్ 2022న ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు”.
ఈ వైరల్ వీడియో, ఈ ఫేస్ బుక్ వీడియోను పోల్చి చూస్తే రెండు ఒకే సంఘటనను చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి, ఈ వైరల్ వీడియో జూన్ 2022న మాన్సాలోని బహరాలీ అనాజ్ మండిలో జరిగిన సిద్ధూ మూసేవాలా యొక్క అంతిమ్ అర్దాస్ (చివరి ప్రార్థన) సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్నది అని నిర్థారించవచ్చు.
చివరగా, సిద్ధూ మూసేవాలా యొక్క అంతిమ్ అర్దాస్ (చివరి ప్రార్థన)కి సంబంధించిన వీడియోను ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.