Fake News, Telugu
 

సంబంధంలేని వీడియోలని, తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌పై ముస్లింలు దాడి చేసినట్టు షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ మహిషాసుర రైల్వే స్టేషన్…దాడి ఎందుకు? – రైలు శబ్దాలు తమ నమాజ్ నీ Disturb చేస్తున్నాయి అని”, అని చెప్తూ, కొన్ని వీడియోలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రైలు శబ్దాలు తమ నమాజ్‌కి ఆటంకం కలిగిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ మహిషాసుర రైల్వే స్టేషన్‌పై దాడి చేస్తున్న తాజా వీడియోలు.

ఫాక్ట్: పోస్ట్‌లోని రెండు వీడియోలు తాజగా తీసిన వీడియోలు కాదు. 2019 నుండి ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నట్టు చూడవచ్చు. 2019లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని నయోపర మహిషాసుర్ రైల్వే స్టేషన్‌పై దాడి జరిగినట్టు తెలిసింది. మూడవ వీడియో అసలు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి సంబంధించింది కాదు. అది తమిళనాడులో రెండు కాలేజీ గ్రూపుల మధ్య జరిగిన గొడవ. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

వీడియో 1:

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. అయితే, వీడియోని సరిగ్గా గమనిస్తే, అందులో స్టేషన్‌ గోడపై ‘Naopara Mahishasur’ (నయోపర మహిషాసుర్) అని రాసి ఉన్నట్టు చూడవచ్చు. ఆ పదాలతో ఫేస్బుక్ వెబ్‌సైట్‌లో వెతకగా, ఎక్కువ నిడివి ఉన్న అదే వీడియో దొరుకుతుంది. ఆ వీడియోని డిసెంబర్ 2019లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు.  

అదే రైల్వే స్టేషన్‌పై దాడి చేస్తున్న మరికొన్ని వీడియోలను 2019లో చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వాటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. పోస్ట్‌లో వీడియో యొక్క సందర్భం కచ్చితంగా తెలియనప్పటికీ,  2019లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని నయోపర మహిషాసుర్ రైల్వే స్టేషన్‌పై దాడి జరిగినట్టు తెలిసింది. 2019లో చేసిన నిరసనల్లో పశ్చిమ బెంగాల్‌లోని వివిధ రైల్వే స్టేషన్‌లపై దాడి జరిగినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

వీడియో 2:

ఈ వీడియో కూడా ఇంటర్నెట్‌లో 2019 నుండి ఉన్నట్టు తెలిసింది. ఇదే వీడియోని 2019లో పోస్ట్ చేసి, నయోపర మహిషాసుర్ రైల్వే స్టేషన్‌ వీడియో అని రాసినట్టు ఇక్కడ చూడవచ్చు.

వీడియో 3:

ఈ వీడియో అసలు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి సంబంధించింది కాదు. అది తమిళనాడులో రెండు కాలేజీ గ్రూపుల మధ్య జరిగిన గొడవకి సంబంధించిన వీడియో. ఇంతకముందు, ఈ వీడియోపై FACTLY వివరంగా రాసిన ఫ్యాక్ట్-చెక్ అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

చివరగా, సంబంధంలేని వీడియోలని పెట్టి, తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌పై ముస్లింలు దాడి చేసినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll