Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోని జవహర్ లాల్ నెహ్రూ అబ్దుల్ కలాం ఆజాద్‌ కోసం ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వ ఇఫ్తార్ విందు అని షేర్ చేస్తున్నారు

0

1947లో భారత దేశ స్వాతంత్రం తరువాత జవహర్ లాల్ నెహ్రూ తన మంత్రివర్గ సహచరుడు, మొట్టమొదటి విధ్యా శాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్‌ కోసం ఏర్పాటు చేసిన మొదటి ఇఫ్తార్ విందు చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. హిందూ పండగలను పట్టించుకోకుండా ముస్లిం పండగకు ప్రభుత్వ విందు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సర్దార్ వల్లభాయి పటేల్ ఈ విందుకి హాజరు కాలేదని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: 1947లో జవహర్ లాల్ నెహ్రూ అప్పటి విధ్యా శాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్‌ కోసం ఏర్పాటు చేసిన మొదటి ఇఫ్తార్ విందులో తీసిన చిత్రం.

ఫాక్ట్ (నిజం): 1948లో రాజగోపాల చారి భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులయిన సంధర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ అప్పటి భారత మంత్రివర్గానికి విందు ఏర్పాటు చేసిన దృశ్యాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్‌, బి.ఆర్.అంబేద్కర్‌లతో పాటు సర్దార్ వల్లభాయి పటేల్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ సందర్భంగా ఈ విందుని ఏర్పాటు చేయలేదు. అంతే కాదు, ఈ విందుని ఏర్పాటు చేసింది జవహర్ లాల్ నెహ్రూ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Alamy’ వెబ్సైట్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 1948 జూన్ నెలలో సి.రాజగోపాల చారి భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులయిన సంధర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ అప్పటి భారత మంత్రివర్గానికి విందు ఏర్పాటు చేసిన దృశ్యమంటూ ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు.

ఈ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, సి.రాజగోపాల చారి భారత గవర్నర్ జనరల్‌గా నియమితులయిన సంధర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ ఇచ్చిన విందులో మరొక కోణం నుండి తీసిన ఫోటో దొరికింది. భారత దేశ మొట్టమొదటి మహిళ ఫోటో జర్నలిస్ట్ హోమై వ్యారవల్ల తీసిన ఈ ఫోటోలో సర్దార్ వల్లభాయి పటేల్ కూడా ఈ విందులో పాలుపంచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్‌, బి.ఆర్.అంబేద్కర్, సర్దార్ వల్లభాయి పటేల్ సహా పలువురు నాయకులు ఈ విందులో పాలుపంచుకున్నారు. ఇఫ్తార్ సందర్భంగా ఈ విందుని ఏర్పాటు చేయలేదని, అలాగే, ఈ విందుని ఏర్పాటు చేసింది  జవహర్ లాల్ నెహ్రూ కాదని, సర్దార్ వల్లభాయి పటేల్ అని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 1948లో సర్దార్ వల్లభాయి పటేల్ భారత మంత్రివర్గానికి ఇచ్చిన విందులో తీసిన ఫోటోని జవహర్ లాల్ నెహ్రూ అబ్దుల్ కలాం ఆజాద్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇఫ్తార్ విందు అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll