“కరోనాతో కుక్క చావు చస్తుంది పాకిస్తాన్ అంటూ టీవీల్లో సంబరాలు చేసుకుంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మానవతా దృక్పధంతో అంబులెన్స్ లు పంపుతుంది”, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విళయ తాండవం చేస్తున్న వేళ, పాకిస్తాన్ మానవత దృక్పధంతో భారతదేశానికి అంబులన్స్ లని పంపించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ భారత దేశానికి అంబులన్స్ వాహనాలు పంపుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Edhi Foundation’, కరోనా వైరస్ తో పోరాడుతున్న భారతదేశానికి సహాయంగా 50 అంబులన్స్ వాహనాలు పంపుతామని చెప్పిన మాట వాస్తవం. కానీ, ‘Edhi Foundation’ చేసిన ఈ ఆఫర్ ని భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ వీడియోలో షేర్ చేసిన నాలుగు వేర్వేరు క్లిప్పులు పాకిస్తాన్ అంబులన్స్ లకి సంబంధించిన పాత వీడియోలు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియోలో నాలుగు వేర్వేరు క్లిప్స్ ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ నాలుగు వీడియో క్లిప్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
క్లిప్-1:
ఈ వీడియో క్లిప్ లో కనిపిస్తున్న అంబులన్స్ వాహనాల పై ‘EDHI Ambulance’ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీనిబట్టి, ఈ అంబులన్స్ వాహనాలు పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Edhi Foundation’ కి సంబంధించినవని చెప్పవచ్చు. ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Geo News’ ఛానల్ 03 డిసెంబర్ 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘Edhi Foundation’ కొత్తగా 100 అంబులన్స్ వాహనాలని తమ సంస్థలో చేర్చుకున్నట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు.
క్లిప్-2:
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్పుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ 2016లో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘Edhi Foundation’ సంస్థ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఎది మరణం తరువాత అంతక్రియల కోసం తీసుకెళ్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. అబ్దుల్ సత్తార్ ఎది మరణానికి సంబంధించి ‘Al Jazeera’ న్యూస్ సంస్థ జూలై 2016లో పబ్లిష్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.
క్లిప్-3:
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్పుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Edhi Foundation’ సంస్థ 08 అక్టోబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజి లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. The Jammu and Kashmir Liberation Front (JKLF) పార్టీ అక్టోబర్ 2019లో నిర్వహించిన ‘ఆజాద్ మార్చ్’ కార్యక్రమం కోసం ఈ అంబులన్స్ లని సిద్దం చేసినట్టు ‘Edhi Foundation’ ఈ పోస్టులో తెలిపారు. ఈ వీడియో ఇటివల తీసినది కాదు.
క్లిప్-4:
ఈ వీడియోలో కనిపిస్తున్న అంబులన్స్ వాహనాల పై ‘CHHIPA Ambulance’ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీనిబట్టి, ఈ అంబులన్స్ వాహనాలు పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Chhipa Welfare Association’ కి సంబంధించినవని చెప్పవచ్చు. ఈ వీడియో క్లిప్పుని కొన్ని పదాలు ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Chhipa Welfare Association’ సంస్థ 25 మే 2016 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. Chhipa అంబులన్స్ సర్వీస్ ప్రకటనకు సంబంధించిన ఈ వీడియోలోని కొన్ని క్లిప్పులని పోస్టులోని వీడియోలో జతచేసినట్టు తెలుస్తుంది.
పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Edhi Foundation’, కరోనా వైరస్ తో పోరాడుతున్న భారతదేశానికి 50 అంబులన్స్ లు సహాయంగా పంపుతామని ఆఫర్ చేసింది. కాని, భారత ప్రభుత్వం ఈ ఆఫర్ ని ఇప్పటివరకు ఆమోదించలేదు. దీనికి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా భారత దేశానికి సహాయంగా పాకిస్తాన్ అంబులన్స్ వాహనాలు పంపుతున్న దృశ్యాలని షేర్ చేసిన ఈ వీడియో తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత వీడియో క్లిప్పులని జోడిస్తూ కరోనా వైరస్ తో పోరాడుతున్న భారతదేశానికి అంబులన్స్ వాహనాలు పంపి సహాయం అందిస్తున్న పాకిస్తాన్ అని షేర్ చేస్తున్నారు.