నిన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన నేపథ్యంలో కొన్ని వీడియోలు, ఫోటోలు ఈ ఘటనకి సంబంధించినవంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ విజువల్స్‌కి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద దృశ్యాల వీడియోలు.
ఫాక్ట్ (నిజం): ఈ వైరల్ వీడియోలలో ఒకటి గత నెల అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిన ఘటనకి సంబంధించిది కాగా, మరొకటి గత సంవత్సరం సిరియాలో ప్రభుత్వ హెలికాప్టర్‌ని ఇస్లామిక్ తీవ్రవాదులు పేల్చేసిన ఘటనకి సంబంధించింది. ఈ రెండు వీడియోలకు బిపిన్ రావత్ మరణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తమిళనాడులోని జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందాడు. ఈ ఘటనకి సంబంధించి హెలికాప్టర్ క్రాష్ అవుతునప్పుడు తీసిన వీడియోలేవి కూడా ఇప్పటివరకి ఎవరూ రిపోర్ట్ చేయలేదు. కొందరు స్థానికులు క్రాష్‌కి ముందు తీసిన వీడియో ఒకటి ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఐతే వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కడివో కింద చూద్దాం.
ఈ వీడియో గత నెల అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన పలు న్యూస్ రిపోర్ట్స్ కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ దృశ్యాలు గత నెల 18 నవంబర్ 2021న అరుణాచల్ ప్రదేశ్‌లో రోచ్చం హెలిప్యాడ్ వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిన ఘటనకి సంబంధించినవి.
ఈ వీడియోని రిపోర్ట్ చేసిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాల బట్టి వైరల్ వీడియోకి నిన్న జరిగిన హెలికాప్టర్ క్రాష్‌కి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.
ఈ వీడియో గత సంవత్సరం ఫిబ్రవరీలో సిరియాలో ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్‌ని ఇస్లామిక్ తీవ్రవాదులు పేల్చేసిన ఘటనకి సంబంధించింది. వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన పలు న్యూస్ రిపోర్ట్స్ కనిపించాయి. ఈ కథనాల ప్రకారం సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ హెలికాప్టర్‌ని ఇస్లామిక్ తీవ్రవాదులు రాకెట్ ద్వారా పేల్చేశారు.

ఈ ఘటనని అప్పట్లో చాలా వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి, ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ ఘటనకి సంబంధించిన మరికొన్ని దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, సంబంధంలేని పాత హెలికాప్టర్ క్రాష్ వీడియోలను జనరల్ బిపిన్ రావత్ ఘటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.