కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తరువాత ఆ రాష్ట్ర ముస్లింలు పాకిస్థాన్ జెండా ఎగరవేస్తూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించిన నాయకులు, కర్ణాటక హిందూ ఓటర్లుకు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవలిసి వస్తుందని ఈ వీడియోని షేర్ చేస్తూ తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తరువాత అక్కడి ముస్లింలు పాకిస్థాన్ జెండా ఎగిరేస్తూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): 2019లో కర్ణాటక రాష్ట్రం కూడచిలో ఈద్ మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ముస్లింలు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో ముస్లింలు ఎగరవేస్తున్నది పాకిస్థాన్ జెండా కాదు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు కర్ణాటక ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను మరొక కోణం నుండి తీసిన వీడియో దొరికింది. ఈ వీడియో కర్ణాటక రాష్ట్రం కూడచి పట్టణంలో తీసినట్టు ఈ వీడియోలో తెలిపారు. 2019 నవంబర్ నెలలో ఈ వీడియోని యూట్యూబ్‌లో పబ్లిష్ చేశారు.
ఈ వివారాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కూడిన వీడియోని కన్నడమ్మ (KNN) వార్తా సంస్థ 12 నవంబర్ 2019 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈద్ మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా కూడచి పట్టణంలోని ముస్లింలు స్వీట్లు పంచుతూ, లౌడ్ స్పీకర్లలో పాటలు పెట్టుకొని వీధులలో చిందులేస్తూ సంబరాలు జరుపుకున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.
వీడియోలో మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ముస్లింలు ఎగరేస్తున్న పచ్చ జెండాను జాగ్రత్తగా గమనిస్తే, అది ఒక ఇస్లాం మత జెండా అని, పాకిస్తాన్ జాతీయ జెండా కాదని స్పష్టంగా తెలుస్తుంది. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, కర్ణాటక ఎన్నికలు లేదా పాకిస్థాన్‌తో ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత వీడియోని కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తరువాత ముస్లింలు పాకిస్తాన్ జెండా ఎగరవేస్తూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.