Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోని చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ IT ఉద్యోగులు హైదరాబాద్‌లో చేపట్టిన భారీ నిరసన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ IT ఉద్యోగులు హైదరాబాద్‌లో భారీ నిరసన చేపట్టిన దృశ్యామంటూ సోషల్ మీడియాలో ఒక డ్రోన్ ఫోటో బాగా షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ IT ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ నిరసన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోని సాయికాంత్ కృష్ణ అనే ఏరియల్ సినిమాటోగ్రాఫర్ 19 ఆగస్టు 2022 నాడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా పబ్లిష్ చేశారు. పోస్టులో షేర్ చేసిన ఫోటోకి చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ IT ఉద్యోగులు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని సాయికాంత్ కృష్ణ అనే ఏరియల్ సినిమాటోగ్రాఫర్ 19 ఆగస్టు 2022 నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌ మరియు ఎక్స్ (ఇదివరకు ట్విట్టర్) సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్ దగ్గర తీసినట్టు సాయికాంత్ కృష్ణ తెలిపారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సాయికాంత్ కృష్ణ ఈ ఫోటోని పబ్లిష్ చేశారు.

విప్రో సర్కిల్ దగ్గర జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఈ ఫోటో తీసినట్టు ఒక యూసర్ సాయికాంత్ కృష్ణ పెట్టిన ట్వీట్ కింద స్పంధించారు. 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలలో భాగంగా 16 ఆగస్టు 2022 నాడు హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని విప్రో సర్కిల్ దగ్గర జరిగిన సామూహిక జాతీయా గీతాలపన కార్యక్రమంలోని దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అంతేకాదు, ఈ ఫోటోని జూమ్ చేసి చూస్తే, విప్రో జంక్షన్ దగ్గర గుమిగుడిన జనాలు జాతీయ జెండాలు పట్టుకొని నిలుచున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోటోకి సంబంధించి మరింత స్పష్టతనివ్వాలని మేము సాయికాంత్ కృష్ణను సంప్రదించాము. సాయికాంత్ స్పంధించిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.

చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ హైదరాబాద్‌లోని సైబర్ టవర్ దగ్గర, విప్రో సర్కిల్ దగ్గర IT ఉద్యోగులు ఇటీవల నిరసన కార్యక్రమాలు చేపట్టిన మాట వాస్తవం. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది మరియు చంద్రబాబు అరెస్టుకి సంబంధించినది కాదు.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోని చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ IT ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమం దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll