‘శ్రీశైలం పుణ్యక్షేత్రంలో E.Oని నిలదీస్తున్న పూజారి..’ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక పూజారి కొందరిని గుడి ప్రాంగణంలో కేక్ కట్ చేసినందుకు నిలదీస్తున్నారు. పోస్టులో చేస్తున్న క్లెయిమ్ లో నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కేక్ కట్ చేసి ఆలయ ప్రాంగణాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు అని ఆవేదనతో ఈవోని నిలదీసిన పూజారి.
ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న వీడియోని ‘తెలుగు NEWJ’ అనే మీడియా సంస్థ తమ ఫేస్బుక్ పేజీలో మార్చ్ 2021లో అప్లోడ్ చేసారు. వీడియో చిత్రించిన ఆలయం యొక్క వివరాలగురించి వారిని సంప్రదించగా, ఈ వీడియో మార్చ్ 2021లో ‘V59 NEWS’ అనే యూట్యూబ్ ఛానల్ వారు అప్లోడ్ చేసారు అని తెలిపారు. ఈ సంఘటన తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఉన్న హనుమాన్ మందిరంలో జరిగిందని, మరియు ఆ సమయంలో పోస్టులో చెప్తున్నట్లు దేవాలయం యొక్క ఈవో అక్కడ లేరని కూడా తెలిపారు. మీర్జాపూర్ హనుమాన్ మందిరానికి సంబంధించి గూగుల్ లో అప్లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలో ఉన్న లొకేషన్ తో సరిపోతున్నాయి. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో ఉన్న వీడియోలో, “ఆలయంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలుసా తెలీదా మీ ఈవో గారికి”, అని పూజారి ప్రశ్నించినప్పుడు, నెంబర్ ఇస్తాము మాట్లాడండి అని ఒకరు అంటారు. ఈ సంభాషణను బట్టి అసలు ఈవో ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేరు అని స్పష్టం అవుతుంది. అసలు ఈ సంఘటన శ్రీశైలంలో జరిగిందా అని వార్త కథనాల కోసం ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఎటువంటి సంభందిత సమాచారం లభించలేదు. వీడియోలో ‘తెలుగు NEWJ’ అనే లోగోని గమనించి, తగిన కీ వర్డ్స్ తో ఇంటర్నెట్లో వెతకగా ‘తెలుగు NEWJ’ అనే ఫేస్బుక్ పేజీలో వైరల్ పోస్టులో ఉన్న వీడియో మాకు లభించింది. సెప్టెంబర్ 2021లో ఈ వీడియోని పోస్ట్ చేసారు. ఇదే వీడియోని మళ్ళీ మే 2022లో కూడా పోస్ట్ చేసారు.
కానీ ఈ పోస్టు వివరణలో ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు. NEWJ వారిని ఈ వివరాల కోసం సంప్రదించగా, వారు ఈమెయిల్ ద్వారా మాకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అందించారు. పోస్టులో ఉన్న వీడియో యొక్క పూర్తి వెర్షన్ మార్చ్ 2021లో ‘V59 NEWS’ అనే యూట్యూబ్ ఛానల్ వారు అప్లోడ్ చేసినట్టు తెలిపారు.
ఈ వీడియో టైటిల్ ‘సిగ్గుండాలి…..! ఆలయాలు ఏమన్నా గెస్ట్ హౌసులా కేకులు కట్ చేయడానికి | మీర్జాపూర్ అలయశుద్ది పూజా’ ని బట్టి ఈ సంఘటన తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలోని మీర్జాపూర్ లో ఉన్న ఒక్క మందిరంలో జరిగింది అని తెలుస్తుంది. NEWJ వారి సమాచారం ప్రకారం, 2021లో కరోనా లొక్డౌన్ సమయంలో కామారెడ్డిలోని మద్నూర్ మండలంలో ఉన్న హనుమాన్ మందిరంలో భక్తులని ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనీయలేదు అధికారులు. కానీ, బర్త్‌డే కేక్ కట్ చేస్కోవటానికి అనుమతించారని, దీని గురించి కామారెడ్డి జిల్లా జుక్కల్ యొక్క మాజీ M.L.A శ్అరుణ తార ఒక శుద్ధి కరణ పూజ ఏర్పాటు చేసారని, ఆ పూజ నిర్వహించిన పూజారి, ఇలా పుట్టినరోజు వేడుక జరుపుకోవటానికి ఈవో ఎలా అనుమతిస్తారు అని దేవాలయ అధికారుల్ని ప్రశ్నించారని NEWJ వారు తెలిపారు.
మీర్జాపూర్ హనుమాన్ మందిరానికి సంబంధించి గూగుల్ లో అప్లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలో ఉన్న లొకేషన్ తో సరిపోతున్నాయి. మీర్జాపూర్ హనుమార్ మందిరం ఈ వీడియోలో చూడవచ్చు. మీర్జాపూర్ హనుమాన్ మందిరం గురించి తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైటులో ఉన్న సమాచారం ఇక్కడ చదవచ్చు.
చివరిగా, 2021లో తెలంగాణాలోని కామారెడ్డి జిల్లా మీర్జాపూర్ హనుమాన్ మందిరంలో జరిగిన సంఘటన యొక్క దృశ్యాలను ఇటీవల శ్రీశైలం దేవాలయంలో ఈవోని పూజారి నిలదీసిన దృశ్యాలంటూ కల్పిత కథనంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.