Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోని రిపబ్లిక్ డే రోజు పోలీసులపై BJP కార్యకర్తల దాడి అంటూ షేర్ చేస్తున్నారు

0

మోదీ ఫోటో ఉన్న టీ-షర్ట్ వేసుకొన్న ఒక వ్యక్తి పోలీసులపైకి కర్ర ఎత్తిన ఫోటోని షేర్ చేస్తూ ఈ ఘటన మొన్న రిపబ్లిక్ డే రోజున జరిగిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిపబ్లిక్ డే రోజున పోలీసులపై దాడి చేసిన BJP కార్యకర్త ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2014లో ఉత్తరప్రదేశ్ లోని శాంతిభద్రతలు మరియు విద్యుత్ సంక్షోభం వంటి విషయాలపై BJP యువ కార్యకర్తలు లక్నోలో నిరసనలు తెలిపిన సందర్భంలో వారికి మరియు పోలీసులకి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించింది. ఈ ఫోటోకి మొన్న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన ఘర్షణలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 30 జూన్ 2014లో ప్రచురించిన ఒక ఆన్‌లైన్ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం 2014లో ఉత్తరప్రదేశ్ లోని శాంతిభద్రతలు మరియు విద్యుత్ సంక్షోభం వంటి విషయాలపై BJP యువ కార్యకర్తలు లక్నోలో నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎదుట పోలీసులకి మరియు BJP కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది, పోస్టులోని ఈ ఫోటో ఆ ఘర్షణలకి సంబంధించిందే.

ఈ కథనం ఆధారంగా గూగుల్ లో వేతగా ఇదే ఫోటో ప్రచురించిన రాజ్యసభ టీవీ వార్తా కథనం కనిపించింది. ఈ కథనం కూడా ఈ ఫోటో 2014లో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పోలీసులకి మరియు BJP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిందని నిర్ధారిస్తుంది. 2014లో జరిగిన ఈ నిరసనలకు సంబంధించి ది హిందూ మరియు ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కూడా వార్తా కథనాలు ప్రచురించాయి. NDTV న్యూస్ వీడియో ఇక్కడ చూడవొచ్చు. ఈ నిరసనలకు సంబంధించి మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిబట్టి ఈ ఫోటో మొన్న రిపబ్లిక్ డే రోజు జరిగిన ఘటనకి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

రిపబ్లిక్ డే రోజున కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పెరేడ్ లో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, సంబంధంలేని పాత ఫోటోని రిపబ్లిక్ డే రోజు BJP కార్యకర్తలు పోలీసులపై దాడి చేసిన ఫోటో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll