Fake News, Telugu
 

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో ఒక చర్చి మంటల్లో కాలిపోకుండా ఉందని పేర్కొంటూ సంబంధం లేని మరియు AI- జనరేటెడ్ ఫోటోలను షేర్ చేస్తున్నారు

0

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ నగరానికి సమీపంలోని అడవిలో 07 జనవరి 2025న ఉదయం చెలరేగిన కార్చిచ్చు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ కార్చిచ్చు లాస్ ఏంజిల్స్ నగరాన్ని చాలావరకు కాల్చి బూడిద చేసింది. పలు రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), ఈ ప్రమాదంలో ఇప్పటికే కనీసం 36 వేల ఎకరాల భూమి బూడిదైంది, 10 వేలకు పైగా గృహాలు, భవనాలు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో హాలీవుడ్ ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి, ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే, “అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మొత్తం కాలిపోయినప్పటికీ, దేవుని మందిరం (చర్చి) చెక్కుచెదరకుండా ఉంది” అంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్స్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి సమీపంలోని అడవిలో ఇటీవల జనవరి 2025లో చెలరేగిన కార్చిచ్చులో ఒక చర్చి మంటల్లో కాలిపోకుండా ఉన్నట్లు చూపిస్తున్న ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి ఈ వైరల్ ఫోటోలకు ఎలాంటి సంబంధం లేదు. మొదటి పోస్టులో ఉన్న మొదటి ఫోటో ఆగస్టు 2023లో హవాయిలోని లహైనాలోని పశ్చిమ మౌయిలో సంభవించిన అగ్నిప్రమాదంలో చెక్కుచెదరకుండా ఉన్న ఓ ఇంటిని చూపిస్తుంది. మిగిలిన ఫోటోలు AI ఉపయోగించి రూపొందించబడ్డాయి. అంతేకాకుండా, లాస్ ఏంజిల్స్‌లో మంటల్లో పలు చర్చిలు,మసీదులు మరియు ఇతర ప్రార్థనా స్థలాలు కాలిపోయాయని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ పోస్టులో చెప్పినట్లుగా లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుల్లో ఒక చర్చి చెక్కుచెదరకుండా ఉందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో ఒక చర్చి కాలిపోకుండా ఉందని తెలిపే వార్తా కథనాలు/రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, ఈ మంటల్లో పలు చర్చిలు, మసీదులు మరియు ఇతర ప్రార్థనా స్థలాలు కాలిపోయాయని తెలిపే పలు వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఫోటో -1:

తదుపరి మేము మొదటి వైరల్ పోస్టులో ఉన్న మొదటి ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం,  వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోను రిపోర్ట్ చేస్తూ “హవాయి అడవి మంటలు: మౌయి మంటల నుండి బయటపడిన ఎరుపు లహైనా ఇల్లు(Hawaii wildfires: The red Lahaina house that survived Maui fires)” అనే శీర్షికతో 22 ఆగస్ట్ 2023న బీబీసీ (BBC) వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, 2023లో హవాయిలో సంభవించిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో చెక్కుచెదరకుండా  ఉన్న ఓ ఇంటిని చూపిస్తుంది.

హవాయిలోని మౌయ్ ద్వీపంలోని లహైనా పట్టణంలో ఘోరమైన మంటలు చెలరేగాయి,ఈ అగ్నిప్రమాదంలో లహైనా పట్టణం చాలా వరకు ధ్వంసమైంది. అయితే, ఈ అగ్నిప్రమాదం 271 ఫ్రంట్ స్ట్రీట్‌లోని 100 ఏళ్ల నాటి ఎర్రటి పైకప్పు ఉన్న ఓ ఇంటిని మాత్రం తాకలేదు. ఇంటి యజమాని ట్రిప్ మిల్లికిన్, అతను మరియు అతని భార్య డోరా అట్‌వాటర్ మిల్లికిన్ ఇటీవలి పునర్నిర్మాణ సమయంలో పైకప్పుకు హెవీ-గేజ్ మెటల్‌ను అమర్చారు, ఇంటి చుట్టూ నది రాళ్ళు ఉన్నాయని తెలిపారని, అందువల్లనే ఈ ఇల్లు మంటల్లో చెక్కుచెదరకుండా ఉందని ఈ కథనం పేర్కొంది. ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆగస్ట్ 2023లో ప్రచురించబడిన మరిన్ని కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇదే ఇంటిని చూపిస్తున్న మరో ఫోటోను మేము స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్ గెట్టి ఇమేజెస్‌లో (Getty images) కూడా కన్నుగొన్నాము. ఈ ఫోటో యొక్క వివరణలో కూడా 10 ఆగస్టు 2023న హవాయిలోని లహైనాలోని పశ్చిమ మౌయిలో జరిగిన అగ్నిప్రమాదం తరువాత చారిత్రాత్మకమైన లహైనాలో ధ్వంసమైన ఇళ్ళు మరియు భవనాల మధ్యలో మంటల నుండి బయటపడిన ఎర్రటి పైకప్పు గల ఇంటిని చూపిస్తుంది అని పేర్కొన్నారు.  

ఫోటో-2:

ఈ వైరల్ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం వైరల్ ఫోటోను గూగుల్ లెన్స్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘About this image’లో ఈ ఫోటో Google AI ఉపయోగించి రూపొందించబడింది అని ఉంది.

29 ఆగస్ట్ 2022న MIT టెక్నాలజీ రివ్యూ కథనంలో (ఆర్కైవ్ లింక్SynthID అనే మానవ కంటికి కనిపించని AI జనరేట్ ఇమేజ్స్ గుర్తించే డిజిటల్ వాటర్‌మార్కింగ్ గురించి వివరిస్తుంది. తదుపరి మేము ఈ వైరల్ ఫోటో AI-జనరేటెడ్ ? లేదా ? అని నిర్ధారించడానికి, ‘sightengine’  అనే AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్ ని  ఉపయోగించి ఈ వైరల్ ఫోటోలను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటోలు 84% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని ఫలితాన్నిఇచ్చింది. అయితే, Hive వంటి ఇతర AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ఈ ఫోటో AI-జనరేటెడ్ అని నిర్ధారించలేదు.

ఫోటో-3:

ఈ వైరల్ ఫోటోలో కనిపుస్తున్న వ్యక్తికి సంబంధించిన సమాచారం కోసం వెతకగా, ఈ వ్యక్తి ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘7NEWS Australia’ అనే మీడియా సంస్థ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 10 జనవరి 2025న షేర్ చేయబడిన ఒక వీడియో లభించింది. ఈ వీడియో వివరణ ప్రకారం, లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో, ఈ వ్యక్తి వీధిలోని అన్ని ఇళ్ళు కాలిపోయాయి, కానీ అతని ఇల్లు దెబ్బతినలేదు. అయితే, వీడియోలో అతని ఇల్లు లేదా వైరల్ పోస్ట్‌లో కనిపించే భవనం లాంటి నిర్మాణం కనిపించలేదు.

ఫోటో-4:

ఈ వైరల్ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇది AI-జనరేటెడ్ ఫోటో అని అర్థమవుతుంది. తదుపరి మేము ఈ వైరల్ ఫోటోAI-జనరేటెడ్ ? లేదా ? అని నిర్ధారించడానికి, Hive అనే AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్ ని  ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటోలు 93.3% AI-జనరేటెడ్ ఫొటోలు కావచ్చని ఫలితాలను ఇచ్చింది. అయితే, ‘Sight engine’ వంటి ఇతర AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ఈ ఫోటో AI-జనరేటెడ్ అని నిర్ధారించలేదు.

చివరగా, లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో ఒక చర్చి మంటల్లో కాలిపోకుండా ఉందని పేర్కొంటూ సంబంధం లేని మరియు AI- జనరేటెడ్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll