ప్రతి ఇంటికి ఉచితంగా వై-ఫై (Wi-Fi) అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం PM-WANI అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా వైఫై అమరుస్తారని ఈ వీడియోలో చెప్పబడింది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: PM-WANI పథకం కింద భారత ప్రభుత్వం అందరికీ ఉచిత Wi-Fiని అందిస్తోంది.
ఫాక్ట్: PM-WANI పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందించడం లేదు. ఇది కేవలం ప్రజలకు తక్కువ ధరకే (రూ. 6 నుండి మొదలు) ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చే పథకం మాత్రమే. వినియోగదారులు డేటా వాడుకోవాలంటే దానికి సంబంధించిన ప్లాన్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
PM-WANI పథకం అంటే ఏమిటి?
భారతదేశం అంతటా పబ్లిక్ Wi-Fi హాట్‌స్పాట్‌ల లభ్యతను విస్తరించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) PM-WANI పథకాన్ని 2020లో ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తక్కువ ధరలకు అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. పబ్లిక్ హాట్‌స్పాట్‌ల సంఖ్యను పెంచడం ద్వారా, సూక్ష్మ, చిన్న వ్యవస్థాపకులకు ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటుగా తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. స్థానిక దుకాణాలు, వ్యాపారాలను ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా Wi-Fi అందించడాన్నిఈ పథకం ప్రోత్సహిస్తుంది, తద్వారా వారికి అదనపు ఆదాయంతో పాటు ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది.

PM-WANI పథకం ద్వారా ఇంటర్నెట్ ఎలా పొందాలి?
ముందుగా, వినియోగదారులు మొబైల్ ఫోన్‌లో ‘PM-WANI’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో వినియోగదారుడి దగ్గరలో ఉన్న Wi-Fi హాట్‌స్పాట్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో నచ్చిన హాట్‌స్పాట్‌ను ఎంచుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా డబ్బుని చెల్లించి డేటా ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్ గడువు/ కోటా ముగిసే వరకు వినియోగదారుడు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
PM-WANI వ్యవస్థ నాలుగు ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది:
పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO): ఇవి స్థానిక దుకాణాలు లేదా వ్యాపారాలు, ఇవి ప్రజలకు Wi-Fi సేవలను అందిస్తాయి.
పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ (PDOA): ఇవి PDOలకు అవసరమైన సాంకేతిక, అకౌంటింగ్ సేవలను అందిస్తాయి.
యాప్ ప్రొవైడర్: వినియోగదారులు తమ దగ్గరలోని Wi-Fi హాట్‌స్పాట్‌లను కనుగొనడానికి, కనెక్ట్ కావడానికి మొబైల్ యాప్‌లను అభివృద్ధి చేస్తారు.
సెంట్రల్ రిజిస్ట్రీ: ఇది అన్ని PDOలు, PDOAలు, యాప్ ప్రొవైడర్ల వివరాలను నమోదు చేసే కేంద్ర వ్యవస్థ.
PM-WANI సెంట్రల్ రిజిస్ట్రీ ప్రకారం, 26 నవంబర్ 2025 నాటికి, 206 PDO అగ్రిగేటర్లు, 112 యాప్ ప్రొవైడర్లు, 3,91,599 పబ్లిక్ Wi-Fi హాట్‌స్పాట్‌లు ఉన్నాయి.

PM-WANI పథకం యొక్క ముఖ్యాంశాలు & ప్రయోజనాలు:
సులభమైన ప్రవేశం: చిన్న వ్యాపారులు PDOగా మారడానికి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు.
స్థానిక మౌలిక సదుపాయాలు: కిరాణా దుకాణాలు, టీ స్టాల్స్ వంటి ఇప్పటికే ఉన్న స్థానిక వ్యాపారాలను ఉపయోగించుకుంటుంది.
డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది: గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉపాధి కల్పన: చిన్న వ్యాపారులకు అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఉపాధిని ప్రోత్సహిస్తుంది.
సరసమైన ఇంటర్నెట్: తక్కువ ధరలకు ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రజలు కూడా డిజిటల్ సేవలను పొందవచ్చు.
PM-WANI డేటా ప్లాన్ వివరాలు
PM-WANI పథకం కింద వివిధ రకాల డేటా ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్లాన్‌లు సాధారణంగా రూ. 6 నుండి రూ. 99 వరకు ఉంటాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డేటా పరిమితి, కాలవ్యవధిని బట్టి వీటిని ఎంచుకోవచ్చు.

పై ఆధారాలను బట్టి, భారత ప్రభుత్వం ఉచితంగా అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందివ్వట్లేదని స్పష్టమవుతుంది. పైగా, వైరల్ వైరల్ వీడియోలో ఇవ్వబడిన లింకు ఒక అనుమానాస్పద వెబ్సైటుకి సంబంధించినది. తెలియని వెబ్సైట్లను క్లిక్ చెయ్యడం, లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం వల్ల వినియోగదారులు వివిధ రకాల సైబర్ క్రైంల భారిన పడతారని ప్రభుతం హెచ్చరిస్తుంది.

చివరిగా, PM-WANI పథకం కింద భారత ప్రభుత్వం అందరికీ ఉచిత Wi-Fiని అందిస్తోందని చెప్తున్న ఈ వీడియో ఫేక్.

