Fake News, Telugu
 

ఒక బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు యూపీ పోలీసులు ఒక వ్యక్తిని కొట్టారని చెప్పి రెండు సంబంధం లేని వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నారు

0

ఒక బాలికతో ఒక వ్యక్తి రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ వారు ఆ వ్యక్తిని కొట్టారని చెప్తున్న ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియో పైన, కింద భాగాల్లో రెండు క్లిప్స్ ఉన్నాయి, మధ్యలో ‘యోగిజీ ట్రీట్మెంట్’ అని ఆంగ్లంలో రాసి ఉంది.  ‘ఒరేయ్ ఆజాము తిక్క తిక్క వేషాలు వేయడానికి అది తెలంగాణ కాదురోయ్ అక్కడ ఒక సింహం ఉంది రోయ్ దూల తీరిపోద్ది ఇలాగే 😂🤷‍♂️ కొంచెం జాగ్రత్తగా బతకండి రా ఇలాంటి చిల్లర వేషాలు మా నీ 😂 మనుషుల్లాగా బతకండి రా…’ అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో పైన భాగంలో ఉన్న క్లిప్‌లో ఒక వ్యక్తి ఒక బాలికతో రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించటం మనం చూడవచ్చు. కింది భాగంలో ఉన్న వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని స్తంభానికి తన చేతులను పెట్టి, బెల్టుతో కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక బాలికతో అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు బెల్టుతో కొడుతున్న వీడియో ఇది. ఈ వీడియోలో పైన భాగంలో ఉన్న క్లిప్‌ ఆ వ్యక్తి రోడ్డుపై ఒక బాలికతో తప్పుగా ప్రవర్తించిన దృశ్యాలను చూపిస్తుంది.

ఫ్యాక్ట్: రెండు సంబంధంలేని వీడియో క్లిప్స్ జోడించి ఈ వీడియోను తయారు చేశారు. పై భాగంలో ఉన్న వీడియో క్లిప్‌ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరిగిన ఒక సంఘటనది, కింది భాగంలో ఉన్న క్లిప్‌ ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వీడియోలో ఉన్న రెండు క్లిప్స్ గురుంచి మేము వేరు వేరుగా పరిశోధన చేశాము. మొదటగా, పైన భాగంలో ఉన్న వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో గురించి పాకిస్తానీ మీడియా సంస్థలు ప్రచురుంచిన కొన్ని వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఉన్న ఆల్-ముస్తాఫా కాలనీలో 15 జూలై 2025న జరిగింది. ఈ సంఘటనలో నిందితుడిని ముల్తాన్‌లోని క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ (CCD) వారు, సీసీటీవీ ఫ్యూటేజి ఆదరంగా అరెస్ట్ చేశారు. అతనిపై పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మీడియా కథనాల్లో ఉంది.  

ఇక కింది భాగంలో ఉన్న వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోకు సంబంధించిన కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఉన్న ముంగ్రా బాద్‌షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 2025లో జరిగింది. 

ముంగ్రా బాద్‌షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) వినోద్ మిశ్రా, ఒక వ్యక్తిని బెల్టుతో కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, 24 ఏప్రిల్ 2025న అతన్ని పోలీస్ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 

వార్తా కథనాల ప్రకారం, ఈ వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి, ఒక పని కోసం SHOకి కొంత డబ్బు లంచంగా ఇచ్చాడు. పని పూర్తి కాక పోయే సరికి అతను SHOని డబ్బు తిరిగి ఇవ్వమన్నప్పుడు SHO అతన్ని ఈ విధంగా కొట్టాడు.

జాగరణ్ వారి  వార్తా కథనంలో బాధితుడి పేరు తౌఫిక్ అలీ అని రాశారు. ఇతనికి తన తాతతో ఏదో భూవివాదం ఉందని, సల్మాన్ అలీ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను అరెస్టు చేశారని జాగరన్ వార్తా కథనంలో పేర్కొన్నారు. దీని బట్టి పాకిస్థాన్ మరియు భారతదేశంలో జరిగిన రెండు వేరు వేరు సంఘటనలకు చెందిన వీడియోలను, ఒక కట్టుకథ అల్లి షేర్ చేసున్నరని మనకు ఈ ఆధారాలను బట్టి అర్థం అవుతుంది. 

చివరగా, ఒక బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు యూపీ పోలీసులు ఒక వ్యక్తిని దండించారని చెప్పి రెండు సంబంధం లేని వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నారు. ఒకటి  పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరిగిన ఒక సంఘటనకు చెందిన వీడియో, రెండోది ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఉన్న ముంగ్రా బాద్‌షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సంఘటనకు చెందినది. 

Share.

About Author

Comments are closed.

scroll