“భారతదేశంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా EMPS -2024(ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024) పేరుతో పథకాన్ని అమలు చేస్తోంది, ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీని అందిస్తోంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం EMPS -2024 పథకం ద్వారా ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాల కొనుగోలుపై 60% సబ్సిడీని అందిస్తోంది.
ఫాక్ట్(నిజం): EMPS-2024 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై గరిష్టంగా రూ.10,000 లేదా ఫ్యాక్టరీ ధరలో 15% వరకు మాత్రమే సబ్సిడీని అందిస్తోంది. భారతదేశంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ FAME (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్) ఫేజ్-I పథకాన్ని ఏప్రిల్ 2015 నుండి 31 మార్చి 2019 వరకు అమలు చేసింది. తరువాత FAME ఫేజ్-II పథకాన్ని ఏప్రిల్ 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2024 వరకు అమలులో ఉంది. FAME-II పథకం 31 మార్చి 2024తో ముగియడంతో, కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ EMPS -2024(ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024) పేరుతో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త పథకం కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.500 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ 1 ఏప్రిల్ 2024 నుండి 31 జులై 2024 వరకు అంటే నాలుగు నెలల పాటు అమలులో ఉంటుంది. ఈ పథకం ద్వారా కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్ల కొనగోలుకు మాత్రమే సబ్సిడీ అందించబడుతుంది. ఈ పథకంలో ఒక్కో ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000 సబ్సిడీ మాత్రమే ఇవ్వబడుతుంది. అలాగే రూ. 1.5 లక్షల వరకు ధర కలిగిన ద్విచక్ర వాహనాలకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది, మొత్తం సబ్సిడీ అనేది వాహన ఫ్యాక్టరీ ధరలో 15%కి పరిమితం చేయడం జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
భారతదేశంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ FAME ఫేజ్-I(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం1 ఏప్రిల్ 2015 నుండి 31 మార్చి 2019 వరకు అమలులో ఉంది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల కొనగోలుపై కేంద్ర ప్రభుత్వం రూ. 895 కోట్ల సబ్సిడీ అందించింది.

కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ FAME ఫేజ్-II పథకాన్ని ఏప్రిల్ 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2022 వరకు రూ.10,000 కోట్లను ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల కొనగోలుపై సబ్సిడీని అందించాలని భారీ పరిశ్రమల శాఖ ఈ పథకాన్ని రూపొందించింది. తదనంతరం, ఈ పథకాన్ని 31 మార్చి 2024 వరకు పొడిగిస్తూ ఈ పథకం ద్వారా అందిచే సబ్సిడీ మొతాన్ని రూ. 10,000 కోట్ల నుండి రూ. 11,500 కోట్లకు పెంచింది. ఈ FAME ఫేజ్-II పథకం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే వారికి ఒక కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీకి రూ. 10,000 సబ్సిడీ లభిస్తుంది. అలాగే, మొత్తం సబ్సిడీ అనేది వాహన ధరలో 40%కి (బస్సులకు) మరియు ఇతర వాహనాలకు 20%కి పరిమితం చేయడం జరిగింది, అలాగే రూ. 1.5 లక్షల వరకు ధర కలిగిన ద్విచక్ర వాహనాలపై మాత్రమే సబ్సిడీ లభిస్తుంది.

FAME-II పథకం 31 మార్చి 2024తో ముగియడంతో, కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ FAME-2 స్థానంలో కొత్తగా EMPS -2024(ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024) పేరుతో పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించడం, గ్రీన్ మొబిలిటీని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 13 మార్చి2024న ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం 3,72,215 ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు కల్పించడం. అలాగే అధునాతన సాంకేతికతను ప్రోత్సహించడం. అడ్వాన్స్డ్ బ్యాటరీలను అందించే వాహనాలకు మాత్రమే ఈ పథకం కింద ప్రోత్సాహకాలు లభించనున్నాయని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా EMPS-2024 దేశంలో సమర్థవంతమైన, పోటీతత్వ, దృఢమైన ఈవీల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ కొత్త పథకం కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.500 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ 1 ఏప్రిల్ 2024 నుండి 31 జులై 2024 వరకు అంటే నాలుగు నెలల పాటు అమలులో ఉంటుంది.
ఈ పథకం ద్వారా కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్ల కొనగోలుకు మాత్రమే సబ్సిడీ అందించబడుతుంది. గతంలో FAME-II పథకంలో కిలోవాట్‌కు రూ.10,000 సబ్సిడీ అందించబడగా ఈ కొత్త పథకంలో కిలోవాట్‌కు రూ.5,000 సబ్సిడీ మాత్రమే పొందుతారు. అలాగే, ఒక్కో ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000 సబ్సిడీ మాత్రమే ఇవ్వబడుతుంది. అలాగే రూ. 1.5 లక్షల వరకు ధర కలిగిన ద్విచక్ర వాహనాలకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది మరియు మొత్తం సబ్సిడీ అనేది వాహన ఫ్యాక్టరీ ధరలో 15%కి పరిమితం చేయడం జరిగింది. మొత్తంగా సుమారు 3.33 లక్షల ఎలక్ట్రిక్ 2-వీలర్లకు ఈ రాయితీ అందించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత చిన్న సైజ్ లోని త్రీ వీలర్లు ఇ-రిక్షా, ఇ-కార్ట్స్ కి రూ.25 వేల వరకు సబ్సిడీ లభించనుంది. అలాగే, పెద్ద త్రీ వీలర్లకు రూ.50 వేల వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.

చివరగా, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం EMPS -2024 పథకం ద్వారా ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాలపై 60% సబ్సిడీ ఇవ్వడం లేదు, గరిష్టంగా ద్విచక్ర వాహన ఫ్యాక్టరీ ధరలో 15% లేదా ఒక్కో ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000 సబ్సిడీ ఇవ్వబడుతుంది.