Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రత దళాలు ఇటీవల ఏప్రిల్ 2025లో ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టపై జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలు చూపిస్తుంది

0

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, “పాకిస్తాన్ గడ్డపై ‘భారతదేశ జాతీయ జెండా’ ను ఎగురవేసిన భారత భద్రతా దళాలు” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, సైనిక యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి కొండ ప్రాంతంలో భారత జెండాను ఎగురవేయడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ భూభాగంలో భారత భద్రతా దళాలు ‘భారత జాతీయ జెండా’ను ఎగురవేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో మావోయిస్టులను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలపై ఇటీవల ఏప్రిల్ 2025లో భద్రత దళాలు భారతదేశ జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలు చూపిస్తుంది. అంతేకాకుండా, ఇటీవల ఏప్రిల్ 2025లో భారత భద్రతా దళాలు పాకిస్తాన్ భూభాగంలో భారత జెండాను ఎగురవేసినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, ఈ పోస్టు యొక్క కామెంట్స్ లో పలువురు యూజర్స్ ఈ వీడియో ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టపై భద్రత దళాలు జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలు చూపిస్తుంది అని పేర్కొన్నారు.

తదుపరి, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ తెలుగు మీడియా సంస్థ ‘సాక్షి’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో (Sakshi TV) షేర్ చేసిన న్యూస్ బులెటిన్ వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోను 01 మే 2025న “ కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఎగురవేసిన భద్రతా దళాలు | ఆపరేషన్ కాగర్” అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టలపై భద్రత దళాలు జాతీయ జెండాను ఎగురవేసిన దృశ్యాలు చూపిస్తుంది.

ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, 31 మార్చి 2026 లోపు మావోయిస్టులను లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులో ములుగు జిల్లాకు సమీపంలో మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన కర్రెగుట్టల్లో 21 ఏప్రిల్ 2025న భారీ ఆపరేషన్‌ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా, భద్రతా దళాలు కర్రెగుట్టల్లోని పలు కొండలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై భారత జాతీయ జెండాను జవాన్లు ఎగురవేశారు. అలాగే ఇటీవల ఏప్రిల్ 2025లో భారత భద్రతా దళాలు పాకిస్తాన్ భూభాగంలో భారత జెండాను ఎగురవేసినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.

చివరగా, ఈ వైరల్ వీడియో మావోయిస్టుల నిర్మూలన కోసం చేపట్టిన ఆపరేషన్ కాగర్‌లో భాగంగా ఇటీవల ఏప్రిల్ 2025లో ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టలపై భద్రత దళాలు జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలు చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll