Fake News, Telugu
 

ఒక తరగతి గదిలో బురఖాలు ధరించిన అమ్మాయిలను అబ్బాయిల నుండి ఓ చిన్న గోడ వేరు చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఈ వీడియో మహారాష్ట్రకు సంబంధించినది

0

ఒక తరగతి గదిలో బురఖాలు ధరించిన అమ్మాయిలను అబ్బాయిలు నుండి ఓ చిన్న గోడ వేరు చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోను “ఇది పాక్ లేదా బంగ్లాదేశ్ లో కాదు ..ఇది మన దేశంలో ని కేరళ రాష్ట్రంలో” అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలోని ఒక తరగతి గదిలో బురఖాలు ధరించిన అమ్మాయిలను అబ్బాయిల నుండి ఓ చిన్న గోడ వేరు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో కేరళకు చెందినది కాదు. ఈ వీడియో మహారాష్ట్రకు సంబంధించినది. ఈ వీడియో మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ‘MOS అకాడమీ’ అనే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందినది. MOS అకాడమీ డైరెక్టర్ ఆమీర్, ఈ వీడియో మహారాష్ట్ర నాందేడ్‌లోని తమ ఇన్‌స్టిట్యూట్‌లో రికార్డ్ చేయబడిందని మాకు ధృవీకరించారు. ఇటీవల సెప్టెంబర్‌ 2025లో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) సమీపంలో ఉన్న ఒక  కమ్యూనిటీ హాలులో విస్డమ్ ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (WISO) నిర్వహించిన కార్యక్రమంలో పురుషులను నుండి మహిళలను వేరు చేస్తూ ఒక గుడ్డ (cloth) ఏర్పాటు చేసినట్లు పలు ఫోటోలు ఆన్‌లైన్‌లో షేర్ అవ్వగా కేరళలో వివాదం చెలరేగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘@aamersrs_mos_academy’ అనే యూజర్ 10 అక్టోబర్ 2025న షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు మేము గుర్తించాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు సంబంధించింది అని తెలుస్తుంది.

‘Aamer Srs (ఆమీర్)’ తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో ఆయన నాందేడ్‌లోని ‘MOS అకాడమీ’ డైరెక్టర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు. అలాగే 10 అక్టోబర్ 2025న అమీర్ ఇదే వీడియోను తన ఫేస్‌బుక్‌లో కూడా షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేశాడు. ‘అమీర్’ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలను మనం పరిశీలిస్తే, ఓ చిన్న గోడ ద్వారా బురఖాలు ధరించిన అమ్మాయిలను అబ్బాయిలు నుండి వేరు చేస్తున్న తరగతి గదికి సంబంధించిన పలు ఇతర వీడియోలను కూడా మనం చూడవచ్చు.

‘MOS అకాడమీ’కి సంబంధించిన మరింత సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా, ‘MOS అకాడమీ’ అనేది మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అని, ఇది NEET, MHT-CET, JEE వంటి పలు పరీక్షలకు కోచింగ్ అందిస్తుందని తెలిసింది. తదుపరి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, మేము(Factly) MOS అకాడమీ డైరెక్టర్ అమీర్‌ను సంప్రదించగా, ఆయన మాతో  (Factly) తో మాట్లాడుతూ, ఈ వీడియో మహారాష్ట్ర నాందేడ్‌లోని వారి  ఇన్‌స్టిట్యూట్‌లో రికార్డ్ చేయబడిందని ధృవీకరించారు.

ఇటీవల సెప్టెంబర్‌ 2025లో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) సమీపంలో ఉన్న ఒక  కమ్యూనిటీ హాలులో విస్డమ్ ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (WISO) నిర్వహించిన కార్యక్రమంలో పురుషులను నుండి మహిళలను వేరు చేస్తూ ఒక గుడ్డ (cloth)ఏర్పాటు చేసినట్లు పలు ఫోటోలు ఆన్‌లైన్‌లో షేర్ అవ్వగా కేరళలో వివాదం చెలరేగింది, ఈ ఫోటోలను WISO కు సంబంధించిన ‘wisdom_cusat’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసింది. ఈ వివాదానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా,ఒక తరగతి గదిలో బురఖాలు ధరించిన అమ్మాయిలను అబ్బాయిల నుండి ఓ చిన్న గోడ వేరు చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నఈ వీడియో కేరళకు చెందినది కాదు; ఈ వీడియో మహారాష్ట్రకు సంబంధించినది.

Share.

About Author

Comments are closed.

scroll