2024 లోకసభ జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ మరియు రాయ్‌బరేలీ రెండు స్థానాలలో పోటీ చేసి గెలిచారు. ఆయన జూన్ 2024లో వయనాడ్ ఎంపీగా రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్ ఎంపీ సీటు ఖాళీ అయింది. ఇటీవల 15 అక్టోబర్ 2024న భారత ఎన్నికల సంఘం (ECI) మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు దేశంలో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ స్థానాలకు మరియు 2 పార్లమెంటరీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున తరుపున ప్రియాంక గాంధీ 23 అక్టోబర్ 2024న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే, “వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇస్లాం/ముస్లిం మతానికి సంబంధించిన జెండాలతో ర్యాలీ నిర్వహించింది” అని చెప్తూ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో తెలుపు రంగులో నక్షత్రం మరియు నెలవంక కలిగి ఉన్న పచ్చ రంగు జెండాలను కొందరు ప్రదర్శించడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇస్లాం/ముస్లిం జెండాలతో ర్యాలీ నిర్వహించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో జరగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీకి సంబంధించినది కాదు. ఈ వీడియో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రాజ్‌మోహన్ ఉన్నితన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినది. అలాగే, ఈ వీడియోలో కనిపించేవి ఏ మతానికి చెందిన జెండాలు కావు, అవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండాలు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో (ఆర్కైవ్డ్ ) 10 జూన్ 2019న యూట్యూబ్ లో అప్లోడ్ అయినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు IUML 2019లో నిర్వహించిన ఓ ర్యాలీకి సంబంధించినవి. దీన్ని బట్టి ఈ వీడియో 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో జరిగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీకి సంబంధించినది కాదని మనం నిర్ధారించవచ్చు.
వైరల్ వీడియోలో కనిపించే జెండాలను నిశితంగా పరిశీలిస్తే, ఈ జెండాలు కేరళకు చెందిన రాజకీయ పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి చెందినవని మేము కనుగొన్నాము. IUML కేరళకు చెందిన రాజకీయ పార్టీ మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో IUML భాగస్వామి. వైరల్ వీడియోలోని జెండాలు మరియు IUML పార్టీ జెండా మధ్య పోలికను క్రింద చూడవచ్చు.
ఈ వీడియోలో మనం మలయాళంలో “ఈ కొలం సతీష్ చంద్రన్ వీట్టిల్ ఇరిక్త్తే… పార్లమెంట్ ఉన్నితన్ విజయిచు పోకట్టే” (ఈ ఏడాది సతీష్ చంద్రన్ ఇంట్లో కూర్చోనివ్వండి, ఉన్నిథన్ గెలిచి పార్లమెంటుకు వెళ్లాలి) అనే నినాదం వినవచ్చు. ఈ సమాచారం ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా, రాజ్‌మోహన్ ఉన్నితన్ 2019 మరియు 2024 ఎన్నికల్లో సార్వత్రిక కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచారని తెలిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ తరపున రాజ్‌మోహన్ ఉన్నితన్ పోటీ చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి కెపి సతీష్ చంద్రన్‌పై గెలుపొందారు. దీన్ని బట్టి ఈ వీడియోలోని దృశ్యాలు కాసర్‌గోడ్ లోక్‌సభ పరిధిలోవి అని తెలుస్తుంది.
అలాగే ఈ వీడియోలో ఒక షాపుపై “Aramana silks (అరమన సిల్క్స్)” అని రాసి ఉండటం మనం చూడవచ్చు. దీని ఆధారంగా గూగుల్ మ్యాప్స్ లో MG రోడ్, కాసరగోడ్ లో ఉన్న ఈ “Aramana silks (అరమన సిల్క్స్)” అనే షాపును జియోలోకేట్ చేశాము. వీటన్నిటి ఆధారంగా ఈ వైరల్ వీడియో 2019 నాటిదని మరియు ఈ వీడియో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రాజ్‌మోహన్ ఉన్నితన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినది అని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో జరగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీకి సంబంధించినవి కావు. ఈ వీడియోలో కనిపించేవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండాలు, ఈ వీడియో 2019 నాటిది.