లియో టాల్స్టాయ్, హెర్బర్ట్ వెల్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొదలైన పాశ్చాత్య తత్వవేత్తలు/శాస్త్రవేత్తలు సనాతన ధర్మంపై తమ నమ్మకాలను వెల్లడించారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ప్రముఖ వ్యక్తులు సనాతన ధర్మంపై గొప్పగా మాట్లాడారు అంటూ వారి వ్యాఖ్యలను ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఇవే వ్యాఖ్యలు ఇస్లాంను ఉద్దేశించి కూడా చేసారని గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పాశ్చాత్య తత్వవేత్తలు/శాస్త్రవేత్తలు సనాతన ధర్మం, హిందుత్వం, ఇస్లాంపై తమ నమ్మకాలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు.
ఫాక్ట్(నిజం): ఈ పాశ్చాత్య తత్వవేత్తలు ఎవరు కూడా సనాతన ధర్మం/ హిందుత్వం/ఇస్లాంను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఈ ప్రముఖులు ఎవరూ మతాల గురించి మాట్లాడినట్టు కూడా పెద్దగా అధరాలు లేవు. కాబట్టి వీరు ఏదైనా మతాన్ని గురించి ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండే అవకాశం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో ప్రస్తావించిన పాశ్చాత్య తత్వవేత్తలు/శాస్త్రవేత్తలు మొదలైనవారు ఎవరు కూడా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించినట్టు మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ నిజంగానే ఈ ప్రముఖులు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే దీనికి సంబంధించి రిపోర్ట్స్ ఉండేవి, కానీ మాకు అలంటి రిపోర్ట్స్ ఏవీ లభించలేదు.
ఇదే వార్త గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ ప్రముఖులు ఇవే వ్యాఖ్యలు హిందుత్వం/హిందువులపై చేసారంటూ షేర్ చేసారు (ఇక్కడ). కానీ నిజానికి వారు హిందుత్వం/హిందువులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలేవి చేయలేదు. అసలు 1923లో వీర్ సావర్కర్ యొక్క “Hindutva: Who is a Hindu?” అనే పుస్తకం విడుదలైన తర్వాతే ‘హిందుత్వ’ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. అప్పటికి పోస్టులో ప్రస్తావించిన ప్రముఖులు చనిపోయారు.
అలాగే ఈ ప్రముఖులే ఇవే వ్యాఖ్యలు ఇస్లాంను ఉద్దేశించి చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు షేర్ అయ్యాయి (ఇక్కడ). ఐతే వీరు ఇస్లాం గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఈ ప్రముఖులు ఎవరూ మతాల గురించి మాట్లాడినట్టు కూడా పెద్దగా రిపోర్ట్స్ లేవు. కాబట్టి వీరు ఏదైనా మతాన్ని గురించి ఇలాంటి విపరీతమైన అభిప్రాయాలు కలిగి ఉండే అవకాశం లేదు.
చివరగా, పాశ్చాత్య తత్వవేత్తలు సనాతన ధర్మం లేదా ఇస్లాంను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు