ఒక లారీ డ్రైవర్ తనకు ఒక అధికారి చలానా వేసిన అనంతరం మళ్ళీ అతనే ఎంట్రీ ఫీజు అడుగుతున్నాడంటూ తనపై మరియు తన లారీపై డీజిల్ పోసి నిప్పంటించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వీడియో ని ఫేస్బుక్ లో పెడుతున్నారు. ఆ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిందని ఆ పోస్టు లో ఆరోపిస్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: లారీ డ్రైవర్ తనను అధికారులు ఫీజులు అడుగుతూ హింసిస్తున్నారని చెప్తూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో జరిగింది.
ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన జరిగింది రాజస్థాన్ రాష్ట్రం లో, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో కాదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వీడియో లోని ఘటన ఆధారంగా కీవర్డ్స్ తో మేము గూగుల్ లో వెతికినప్పుడు, ‘Khulsa Online’ అనే న్యూస్ వెబ్సైట్ యొక్క వార్తా కథనం లభించింది. ఆ కథనం ప్రకారం ఘటన రాజస్థాన్ లో జరిగిందని ఉంది మరియు దానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా ఉంది. ఆ పూర్తి వీడియో లో రాజస్థాన్ ఆర్టీవో అధికారుల వాహనం కూడా కనిపిస్తుంది.
అదే ఘటన ఆధారంగా ‘Transport Tv’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా న్యూస్ ని ప్రసారం చేసింది. ఆ న్యూస్ వీడియో లో ఆ ఘటన ‘23 జులై 2020’ న రాజస్థాన్ లో జరిగిందని, లారీ డ్రైవర్ ని ఫీజు అడిగింది జోధ్ పూర్ ఆర్టీవో అధికారులని తెలిపారు. ఆ న్యూస్ వీడియో లో పంజాబ్ కి చెందిందిన లారీ డ్రైవర్ ఇక్బాల్ తనకు జరిగిన ఘటన గురించి కూడా వివరించాడు. ఇక్బాల్ నాగౌర్-జోధ్ పూర్ రహదారిపై గుజరాత్ కి వెళ్తుండగా జోధ్ పూర్ ఆర్టీవో అధికారులు అతని వాహనానికి డబుల్ డీజిల్ ట్యాంక్ ఉందనే కారణంగా చలాన్ వేశారని, మళ్ళీ అతను గుజరాత్ నుండి తిరిగి వచ్చేటప్పుడు, అదే మార్గంలో అదే ఆర్టీవో ఎంట్రీ ఫీజు 500 రూపాయలు ఇవ్వమని కోరారని చెప్పారు. కావున, ఘటన రాజస్థాన్ రాష్ట్రం లో జరిగింది.
అదే ఘటన గురించి ‘Patrika’ వార్తా పత్రిక ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.
చివరగా, వీడియో లోని లారీ డ్రైవర్ తనను అధికారులు రుసుములు అడుగుతూ హింసిస్తున్నారని చెప్తూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం లో జరిగింది.