హాస్పిటల్‌లో ఒక శ్వేతజాతి వ్యక్తి తనకు పుట్టిన కవల పిల్లలను చూసేందుకు వెళ్లగా, ఆ కవలలకు నల్లటి జుట్టు, నలుపు రంగు చర్మం ఉండటంతో, ఆ పిల్లలు తన పిల్లలు కాదని, DNA టెస్ట్‌లో కూడా DNA మ్యాచ్ కాలేదని గొడవ చేస్తున్న దృశాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నిజమైన ఘటనను చూపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక తెల్ల జంటకు నల్లరంగు కవలలు జన్మించగా భర్త భార్యపై అనుమానంతో హాస్పిటల్‌లో గొడవ చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన ఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించారు. ఈ వీడియోను AI ద్వారా రూపొందించారని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను కలిగి ఉన్న పలు సోషల్ మీడియా పోస్టులు మాకు లభించాయి. ఈ వీడియోలను జాగ్రతగా పరిశీలిస్తే, ఒక పోస్టులోని వీడియోలో ‘InVideo’ అనే AI వీడియో క్రియేషన్ టూల్ వాటర్‌మార్క్‌ను మేము గమనించాము. అంతేకాకుండా, పలువురు సోషల్ మీడియా యూజర్స్ ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తూ ఈ వీడియో AI ద్వారా సృష్టించబడిందని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ).

అలాగే, ఇదే వీడియోను అక్టోబర్ 20252లో టిక్‌టాక్‌లో “br_ai_ded”అనే యూజర్ కూడా అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ వీడియో రూపొందించినట్లు యూజర్ పేర్కొన్నారు. అలాగే, ఈ పేజీ (br_ai_ded) వివరణలో కూడా ఈ పేజీ AI సహాయంతో రూపొందించిన వీడియోలు/దృశ్యాలు పోస్టు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఛానెల్‌లో మనం ఇలాంటి AI జనరేటెడ్ వీడియోలను అతని యూట్యూబ్ ఛానెల్‌లో, టిక్‌టాక్‌లో కూడా మనం చాలా చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ).

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 100% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరిగా, ఒక తెల్ల జంటకు నల్లరంగు కవలలు జన్మించగా భర్త భార్యను అనుమానించాడు అంటూ AI ద్వారా తయారు చేసిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

