కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఒక చేప ఆవు పాలు తాగుతుందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆవు పాలను చేప తాగడాన్ని చూపుతున్న వీడియో.
ఫాక్ట్: ఇది AI ద్వారా రూపొందించబడిన వీడియో. నిజమైన ఘటన కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ వీడియో గురించి ఇంటర్నెట్లో వెతకగా ఇటువంటి ఘటన జరిగినట్లు ఎక్కడా వార్తా కథనాలు లభించలేదు. ఇక వైరల్ వీడియోని పరిశీలించగా, వీడియోలోని ఆవు, చేప అసహజమైనవిగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, నీటి కదలికలు కూడా సహజత్వానికి భిన్నంగా ఉన్నాయి. చేప మొప్ప(రెక్క) కూడా ఉన్నట్లుండి మాయమై మళ్లీ కనిపిస్తుంది. ఈ ఆధారాలు బట్టి ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించి ఉంటారని భావించవచ్చు.
ఇక వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియో డోయున్ అనే చైనీస్ సోషల్ మీడియా యాప్‌లో ముందుగా 06 జూన్ 2025న ‘Little Star Absurb AI’ అనే పేజిలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ పేజీలో AI తో రూపొందించిన వీడియోలని అప్లోడ్ చేస్తారని వివరణలో పేర్కొన్నారు. అలాగే, వైరల్ వీడియో కూడా AI ద్వారా రూపొందించబడినదని పేర్కొన్నారు.

అదనంగా, AI వీడియోలను గుర్తించే Hive వంటి సాధనాలు కూడా ఈ వీడియో AI ద్వారా రూపొందించబడినదని నిర్ధారించాయి. పైగా, చేపలు ఆవు పాలు లేదా ఇతర క్షీరదాల పాలను తాగి జీర్ణం చేసుకోలేవు. వాటికి పాలలో ఉండే లాక్టోజ్‌ను జీర్ణం చేయడానికి అవసరమైన లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండదు.

చివరిగా, చేప ఆవు పాలను తాగున్నట్లుగా ఉన్న ఈ వీడియో AI ద్వారా రూపొంచించబడినది.