రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి నిర్భయంగా ఒక పులిని పట్టుకొని, దానికి మద్యం తాగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో 5 అక్టోబర్ 2025న జరిగిందని, రాజు పటేల్‌గా గుర్తించబడిన ఈ వ్యక్తి మద్యం మత్తులో తనకు ఎదురుగా వచ్చిన ఒక పులికి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బీరు తాగించబోయాడని చెప్తూ ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లో ఒక రోడ్డుపై ఒక తాగుబోతు వ్యక్తి ఒక పులిని పట్టుకొని మద్యం తాగించడానికి ప్రయత్నించిన నిజమైన సంఘటన యొక్క వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజమైన సంఘటన కాదు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ అక్కడ అలాంటి సంఘటన జరగలేదని ధృవీకరించారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఈ వీడియోలో కనబడుతున్న సంఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము, కానీ దీని ద్వారా మాకు ఈ క్లెయిమ్‌కు మద్దతు ఇచ్చే ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.
అయితే ఈ సెర్చ్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ అధికారులు ఈ వీడియో నకిలీదని ధృవీకరించారని పేర్కొన్న కొన్ని వార్తా కధానాలు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ)

మరింత ధృవీకరణ కోసం, మేము మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్‌ను సంప్రదించాము. ఆయన ఈ వీడియో నకిలీదని ధృవీకరించారు. అలాగే ఇటీవల పులికి సంబంధించిన అటువంటి సంఘటన ఏదీ జరగలేదని స్పష్టం చేశాడు.
అదనంగా, మేము వైరల్ పోస్ట్‌లను పరిశీలించగా, ఈ వీడియో AI-ఉపయోగించి తయారు చేసినదని కొందరు యూజర్లు కామెంట్ చేయడం గమనించాము. ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి, మేము హైవ్ అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి ఈ వీడియోను విశ్లేషించాము. ఇది AI-జనరేటెడ్ వీడియో అని హైవ్ యొక్క విశ్లేషణలో మాకు తెలిసింది. దీనిబట్టి వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదని మనకు స్పష్టం అవుతుంది.

చివరగా, మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తి, ఒక పులిని పట్టుకొని, దానికి మద్యం తాగించడానికి ప్రయత్నిస్తున్న నిజమైన సంఘటనకు చెందిన వీడియో అని చెప్తూ ఒక AI- జనరేటెడ్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

