Fake News, Telugu
 

CNNకి ఈ ట్వీట్‌లతో సంబంధంలేదు; ఫోటోలో ఉన్న వ్యక్తి జోర్డీ జోర్డన్ అనే యూట్యూబర్

0

ఒకే వ్యక్తి ఫోటోను 2021లో అఫ్గానిస్తాన్‌లో మరియు 2022లో ఉక్రెయిన్‌లో చనిపోయాడని CNN వారు ట్వీట్ చేసినట్టు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ఆ రెండు చోట్ల చనిపోయిన వ్యక్తి పేరు బెర్నీ గోర్స్ అని పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2021లో అఫ్గానిస్తాన్‌లో మరియు 2022లో ఉక్రెయిన్‌లో ఒకే వ్యక్తి చనిపోయాడంటూ ట్వీట్ చేసిన CNN ఫోటో.

ఫాక్ట్: అసలు పోస్టులో ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ @CNNAfghan, మరియు @CNNUKR CNNకి సంబంధించినవి కావు. ఆ అకౌంట్స్ ట్విట్టర్ సస్పెండ్ చేసింది. పోస్టులో ఉన్న వ్యక్తి పేరు జోర్డీ జోర్డన్; బెర్నీ గోర్స్ కాదు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఇటీవల కూడా ఎల్డెన్ రింగ్ అనే గేమ్‌ను అతను  లైవ్ స్ట్రీమ్ చేసాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

పోస్టులో ఉన్న వ్యక్తి పేరు జోర్డీ జోర్డన్; బెర్నీ గోర్స్ కాదు. వ్యక్తి యొక్క ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఫోటో జోర్డీ జోర్డన్ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో లభించింది. ఒక రోజు ముందు కూడా (27 ఫిబ్రవరి 2022న) ఎల్డెన్ రింగ్ అనే గేమ్‌ను అతను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేసినట్టు చూడొచ్చు.

ట్విట్టర్ అకౌంట్స్ @CNNAfghan, మరియు @CNNUKR ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా, ఆ అకౌంట్స్ ట్విట్టర్ సస్పెండ్ చేసిందని తెలుస్తుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ అకౌంట్స్ కు బ్లూ టిక్ వెరిఫికేషన్ లేదు.

బెర్నీ గోర్స్ అనబడే CNN జర్నలిస్ట్ అఫ్గానిస్తాన్‌లో మరణించాడని ఇటువంటి ట్వీట్ 2021లో వైరల్ అయినప్పుడు, రాయిటర్స్ వారు CNNకు సంబంధించిన మాట్ దొర్నిక్ ను అడగగా, అది ‘ఒక ఫేక్ పోస్ట్’ అని తెలిపారు. ఇటువంటి ట్వీట్‌కు సంబంధించి FACTLY 2021లో ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసింది.  

చివరగా, CNNకి ఈ ట్వీట్‌లతో సంబంధంలేదు; ఫోటోలో ఉన్న వ్యక్తి జోర్డీ జోర్డన్ అనే యూట్యూబర్.

Share.

About Author

Comments are closed.

scroll