హిందూ దేవాలయంలో క్రైస్తవ శిలువ చిహ్నాన్ని పెయింట్ చేసిన ఫోటో షేర్ చేస్తూ, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లోని హిందూ దేవాలయంలో క్రైస్తవ శిలువ చిహ్నాన్ని పెయింట్ చేసారు.
ఫాక్ట్ (నిజం): ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ జిల్లాలోని ఎల్లపల్లి గ్రామంలో ఉన్న అమ్మాన్ దేవాలయంలో జనవరి 2021లో చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి భాస్కర్ అనే వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని అక్కడి లోకల్ వార్తా పత్రికలు ప్రచురించాయి. మరికొన్ని ఆన్లైన్ వార్తా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విథంగా ఉంది.
పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని రిపోర్ట్ చేసిన ఓపిండియా కథనం ఒకటి మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఘటన ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ సమీపంలో తమిళనాడు వైపున్న తిరుపత్తూర్ జిల్లాలోని ఎల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
పైన తెలిపిన కథనం ఆధారంగా తమిళనాడులోని ప్రథాన పత్రికల్లో ఈ వార్త కోసం వెతకగా, 18 జనవరి 2021 రోజున దినకరన్ అనే పత్రిక ఈ వార్తని ప్రచురించిన కథనం మాకు కనిపించింది. ఈ కథనం కూడా ఈ ఘటన తిరుపత్తూర్ జిల్లాలోని ఎల్లపల్లి గ్రామంలోని అమ్మాన్ దేవాలయంలో చోటు చేసుకుందని ధ్రువీకరిస్తుంది. ఈ ఘటనకి సంబంధించి భాస్కర్ అనే వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని ఈ కథనంలో ఉంది.
ఈ ఘటన తిరుపత్తూర్ జిల్లాలోని ఎల్లపల్లి గ్రామంలో జరిగిందని తెలిపే మరికొన్ని ఆన్లైన్ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా హిందూ దేవాలయంలో క్రైస్తవ శిలువ చిహ్నాన్ని పెయింట్ చేసిన ఈ ఘటనకి ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, హిందూ దేవాలయంలో క్రైస్తవ శిలువ చిహ్నాన్ని పెయింట్ చేసిన ఈ ఘటన తమిళనాడులో జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కాదు.