Fake News, Telugu
 

జాతీయ జెండాను పోలిన జెండాపై మసీదు చిహ్నం ఉన్న ఈ ఫోటో పాతది, కనీసం 2018 నుండి ఇంటర్నెట్‌లో ఉంది.

0

అశోక చక్రానికి బదులుగా మసీదు/సమాధి చిహ్నంతో భారత జాతీయ జెండాను పోలిన త్రివర్ణ పతాకం ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్టు వివరణలో  ఈ సంఘటన కర్ణాటకలోని సిరుగుప్పలో జరిగిందని, ఇటీవలి కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇది చోటుచేసుకుందని చెప్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఇటీవలి (2023) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, అశోక చక్రానికి బదులు మసీదు చిహ్నం కలిగిన జాతీయ జెండా కర్ణాటకలోని సిరుగుప్పలో ఎగురవేశారు.

 ఫాక్ట్(నిజం): ఘటన జరిగిన ప్రదేశం కర్ణాటకలోని సిరుగుప్ప అయినప్పటికీ, ఈ ఫోటో ఇటీవలిది కాదు. ఇది కనీసం నవంబర్ 2018 నుండి ఇంటర్నెట్‌లో చెలామణిలో ఉంది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

ఈ సంఘటన గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, పోస్టులో చేస్తున్న అదే క్లెయిమ్‌తో అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు దొరికాయి, వీటిల్లో అతి పాతవి నవంబర్ 2018 నాటివి. (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ )

ఈ పోస్ట్‌లలో వేర్వేరు జెండాలను మోస్తున్న వ్యక్తుల అనేక చిత్రాలు ఉన్నాయి, వాటిలో ఒక జండా  భారత జాతీయ జెండాను పోలి ఉంది, ఈ జండాపై అశోకచక్రానికి బదులు మసీదు చిహ్నం ఉంది,. ఈ ఫోటోలలో ఒకదానిలో, జెండా పట్టుకున్న వ్యక్తి వెనుక “భవాని సూపర్ మార్కెట్” అని రాసి ఉన్న సైన్ బోర్డ్ మనకు కనిపిస్తుంది.

దీన్ని క్లూగా తీసుకుని Google Maps ద్వారా కర్ణాటకలోని సిరుగుప్పలో అదే సైన్‌బోర్డ్‌తో ఒక దుకాణం ఉంది అని నిర్ధారించాము. ఇది సిరుగుప్పలోని జేవర్గీ చామరాజనగర్ రోడ్డులో ఉంది.  దీన్ని బట్టి ఈ సంఘటన జరిగిన ప్రదేశం నిజంగా సిరుగుప్ప అని తెలుస్తుంది.

ఈ విషయాన్ని గురించి  ఏదైనా మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయా అని వెతికితే, అటువంటి రిపోర్టులు ఏవీ దొరకలేదు. అలాగే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కర్ణాటకలో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగినట్లు ధృవీకరించడానికి కూడా కచ్చితమైన సమాచారం లేదు.

చివరిగా, జాతీయ జెండాను పోలిన జెండాపై మసీదు చిహ్నం ఉన్న ఈ ఫోటో పాతది, కనీసం 2018 నుండి ఇంటర్నెట్‌లో ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll