Fake News, Telugu
 

ఈ ఫొటో ఇటీవల పాకిస్థాన్‌లో అత్యాచారానికి గురైన బెల్జియం మహిళది కాదు

0

ఇటీవల పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో బెల్జియం మహిళపై అత్యాచారం జరిగినట్టు వార్తా పత్రికలు రిపోర్ట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించి ఒక విదేశీ మహిళ ఫోటో షేర్ అవుతూ ఉంది. ఈ ఫొటోలో ఉన్నది అత్యాచారానికి గురైన బెల్జియం మహిళ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించి నిజమేంటో  చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అత్యాచారానికి గురైన బెల్జియం మహిళ ఫొటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో ఉన్నది తెరెజా హ్లుస్కోవా అనే చెక్ రిపబ్లిక్ మోడల్. 2018లో డ్రగ్స్ కేసులో ఈమెను లాహోర్ లో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటీవల జరిగిన బెల్జియం మహిళ అత్యాచార ఘటనకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పాకిస్థాన్‌లో బెల్జియం మహిళపై ఐదు రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడి, ఇస్లామాబాద్ లోని G-6 ప్రాంతంలో దుండగులు విడిచిపెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని 28 ఏళ్ల సిల్వీ స్టినాగా గుర్తించారు. దుండగులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, ఆమెను వదిలి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఒక ఫోటో ప్రచారంలో ఉంది (ఇక్కడ & ఇక్కడ).

ఐతే వైరల్ పోస్టులో షేర్ చేసిన ఫొటోకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటోలో ఉన్నది అత్యాచార బాధితురాలు కాదు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను 2023లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది.

ఈ కథనం ప్రకరాం ఈమె చెక్ రిపబ్లిక్‌కు చెందిన తెరెజా హ్లుస్కోవా. లాహోర్ విమానాశ్రయంలో ఈమె వద్ద హెరాయిన్ దొరికడంతో 2018లో పాకిస్థాన్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఆమె ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడగా, అనేక అప్పీళ్ల అనంతరం 2022లో ఈమె విడుదల అయ్యింది. ఈ విషయానికి సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ సమాచారాన్ని బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ ఫొటోకు ఇటీవల జరిగిన బెల్జియం మహిళ అత్యాచార ఘటనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

చివరగా, ఈ ఫొటో ఇటీవల పాకిస్థాన్‌లో అత్యాచారానికి గురైన బెల్జియం మహిళది కాదు

Share.

About Author

Comments are closed.

scroll