ఫోటోలో ఉన్నది ఈజిప్ట్ కి చెందిన 5,500 సంవత్సరాల పురాతనమైన మూడు సింహాల విగ్రహం అని చెప్తూ, ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ విగ్రహాన్ని అశోకుడి కాలం కంటే ముందే నిర్మించారని పోస్ట్ లో చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫోటోలో ఉన్నది ఈజిప్ట్ కి చెందిన 5,500 సంవత్సరాల పురాతనమైన మూడు సింహాల విగ్రహం.
ఫాక్ట్: విగ్రహం ‘సెర్బెరస్’ అనే మూడు తలల కుక్కది. గ్రీకు పురాణాల ప్రకారం సెర్బెరస్ పాతాళానికి రాజు అయిన హేడీస్ యొక్క కుక్క. అంతేకాదు, ఫోటోలోని విగ్రహం సుమారు 1,800 సంవత్సరాల ముందుది మాత్రమే; పోస్ట్ లో చెప్పినట్టు 5500 సంవత్సరాల పురాతనమైనది కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఆ విగ్రహం హెరాక్లియోన్ పురావస్తు మ్యూజియం లో ఉన్నట్టు రాసారు. అంతేకాదు, ఆ విగ్రహం మూడు తలల కుక్క సెర్బెరస్ ది అని రాసి ఉన్నట్టు చదవొచ్చు.
ఆ విగ్రహం ఉన్న హెరాక్లియోన్ పురావస్తు మ్యూజియం వారి వెబ్సైటులో కూడా ఆ విగ్రహం సెర్బెరస్ అనే కుక్క ది అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, ఆ విగ్రహం సుమారు 1,800 సంవత్సరాల ముందుది అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కాబట్టి, ఆ విగ్రహం అశోకుడి కాలం కంటే ముందుది కూడా కాదు. విగ్రహం కి సంబంధించిన వివరాలు ‘alamy’ స్టాక్ వెబ్సైటులో కూడా చూడవొచ్చు.
గ్రీకు పురాణాల ప్రకారం సెర్బెరస్ పాతాళానికి రాజు అయిన హేడీస్ యొక్క కుక్క. ప్రాణాలతో ఉన్నవారు పాతాళ లోకం లోనికి రాకుండా, లోపలికి వచ్చినవారిని బయటికి పోకుండా సెర్బెరస్ కాపలా కాసేది అని గ్రీకు పురాణాల్లో చదవొచ్చు. సెర్బెరస్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. హ్యారీ పోటర్ కథల్లోని ఫ్లఫ్ఫీ అనే క్యారెక్టర్ కూడా సెర్బెరస్ ఆధారంగా రూపొందించి ఉంటారని కొందరు రాసినట్టు ఇక్కడ చదవొచ్చు.
చివరగా, ఫోటోలో ఉన్నది 5,500 సంవత్సరాల పురాతనమైన మూడు సింహాల విగ్రహం కాదు. విగ్రహం సెర్బెరస్ అనే మూడు తలల కుక్కది.