కేరళలో పాలస్తీనాకు మద్దతు పలుకుతూ ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో పాలస్తీనా జెండాకు బదులుగా ఇటలీ జెండాను ప్రదర్శించిన చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. పాలస్తీనా జెండా, ఇటలీ జెండాలు ఒకే విధంగా ఉండటంతో కేరళలోని ముస్లింలు పాలస్తీనా జెండా అనుకొని ఇటలీ జెండాను పట్టుకొని ఊరంతా ర్యాలీ నిర్వహించారంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ముస్లింలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో పాలస్తీనా జెండాకు బదులుగా ఇటలీ జెండాను ప్రదర్శించారు.
ఫాక్ట్ (నిజం): పాలస్తీనాకు మద్దతుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ రాష్ట్రం కోజికోడ్ నగరంలో నిర్వహించిన ర్యాలీలోని చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోలో ఉద్యమకారులు పట్టుకున్నది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క జెండా, ఇటలీ జెండా కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే, ఈ ఫోటోలో నిరసనకారులు పట్టుకున్న బ్యానర్‌పై వెల్ఫేర్ పార్టీ కేరళ అనే ఆంగ్ల అక్షరాలు రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం వెతికితే, ఇదే ఫోటోని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ కమ్యూనిటీ ఫేస్‌బుక్ పేజీ 17 అక్టోబర్ 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది.
పాలస్తీనాకు మద్దతుగా, గాజా యోధులకు తమ సంఘీభావం తెలుపుతూ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ రాష్ట్రం కోజికోడ్ నగరంలో ర్యాలీ నిర్వహించినట్టు ఈ ఫోటోలను షేర్ చేస్తూ తెలిపారు. ఈ ఫోటోలో నిరసనకారులు పట్టుకున్నది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధికారిక రాజకీయ పార్టీ జెండా అని స్పష్టంగా తెలుస్తుంది.
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జెండాను, ఇటలీ మరియు పాలస్తీనా జెండాలతో పొలుస్తూ రూపొందించిన చిత్రాన్ని కింద చూడవచ్చు.
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీకి సంబంధించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. పై వివారాల ఆధారంగా ఫోటోలో నిరసనకారులు ఊపుతున్నది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జెండా అని, ఇటలీ లేదా పాలస్తీనా జెండాలు కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జెండాను కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ముస్లింలు ఇటలీ జెండా పట్టుకొని ర్యాలీ నిర్వహించారని తప్పుగా షేర్ చేస్తున్నారు.