Fake News, Telugu
 

ఈ ఫోటోలోని వ్యక్తి ట్రంప్ ని పూజించడానికి, వలసదారుల విషయంలో ట్రంప్ వ్యాఖ్యలకి సంబంధం లేదు

0

వలసదారులు విషయం లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి భయపడి ట్రంప్ ఫోటోకి పూజ చేస్తున్నారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి ట్రంప్ ని పూజిస్తున్న ఫోటో కూడా ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అమెరికా చట్టాలను ఉల్లంఘించి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులని వెనక్కి తీసుకోని దేశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అన్న ట్రంప్ వ్యాఖ్యలకి భయపడి ట్రంప్ ఫోటోకి పూజ చేస్తున్నారు.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల ముందు నుండే ట్రంప్ కి పూజ చేస్తున్నాడు. పైగా పోస్టులో ఉన్న ఫోటోలో సావర్కర్, మోడీ ఫోటోలని ఫోటోషాప్ చేసి అతికించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో ఉన్న ఫోటోని క్రాప్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ వార్తా కథనం 23 జూన్ 2018న ప్రచురించబడింది. ఈ కథనం ప్రకారం ఫోటోలో ఉన్నది జనగామ దగ్గర్లోని కొన్నే గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ అని తెలిసింది. 2017 ఫిబ్రవరిలో అమెరికాలో జరిగిన జాత్యాహంకార దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల అనబడే భారత టెక్కీ చనిపోయిన తరవాత ట్రంప్ ఫొటోలకి పూజలు చేయడం మొదలుపెట్టాడని తెలుస్తుంది. వలసదారుల వ్యవహారంలో ట్రంప్ పాలసీ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ పూజలు చేస్తున్నానని చెప్పాడు. ఐతే అమెరికా చట్టాలను ఉల్లంఘించి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులని వెనక్కి తీసుకోని దేశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అన్న ట్రంప్ వ్యాఖ్యలకి భయపడి ట్రంప్ ఫోటోని పూజిస్తున్నాడన్న అన్న వాదనలో నిజం లేదు.

ఐతే ఈ కథనంలో ప్రచురించిన ఫోటోని, పోస్టులో ఉన్న ఫోటోతో పోల్చి చూసినప్పుడు, వార్తా కథనంలో ఉన్న ఫోటోలో ట్రంప్ ఫోటో తల మీద పెట్టుకున్న వ్యక్తి వెనకాల గోడపైన ఉన్న దేవుడి ఫోటో స్థానంలో గాడ్సే మరియు సావర్కర్ ఫోటోని, ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్న ఫోటో స్థానంలో మోడీ ఫోటోని అతికించారని స్పష్టంగా అర్ధమవుతుంది. దీన్ని బట్టి పోస్టులో ఉన్న ఫోటోలో మోడీ, సావర్కర్ ఫోటోని మరియు దీపాల ఫోటోలను ఫోటోషాప్ చేసి అతికించారని చెప్పొచ్చు.

పోస్టులోని ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మరింత వెతకగా ఇతను ట్రంప్ కోసం గుడి కట్టించి అందులో ట్రంప్ విగ్రహం ఏర్పాటు చేసాడని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పోస్టులో ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల ముందు నుండే ట్రంప్ కి పూజ చేస్తున్నాడు. పైగా పోస్టులో ఉన్న ఫోటోలో సావర్కర్, మోడీ ఫోటోలని ఫోటోషాప్ ద్వారా అతికించారు.

Share.

About Author

Comments are closed.

scroll