Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసన చేపట్టిందని చెప్తున్న ఈ న్యూస్ క్లిప్ ఫేక్

0

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెంచిన డైట్ చార్జీలు తగ్గించాలని ఏబీవీపీ నిరసన చేసిందని చెప్తున్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘డైట్ చార్జీలు తగ్గించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్’ అనే శీర్షికతో ఉన్న Way2News క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘డైట్ చార్జీలు తగ్గించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్’ అనే శీర్షికతో ఉన్న Way2News క్లిప్.

ఫాక్ట్ (నిజం): తెలంగాణ ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసన చేయలేదు. అలాగే వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ Way2News ప్రచురించలేదు. అది డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసారు. పైగా ఈ న్యూస్ క్లిప్‌లో ప్రస్తావించిన ఏబీవీపీ కార్యకర్త వెన్నెల గౌడ్ స్వయంగా ఈ వార్త ఫేక్ అని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను 25 శాతం పెంచాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే డైట్ చార్జీలు అనేవి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించేవి, కాని దీనిని విద్యార్థులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలు అనుకొని, ఏబీవీపీ దీనికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిందని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు.

ఐతే నిజానికి ఏబీవీపీ డైట్ చార్జీల విషయంలో ఇలా నిరసనలు చేపట్టినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ లేవు. పైగా వైరల్ పోస్టులో ‘డైట్ చార్జీలు తగ్గించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్’ అనే శీర్షికతో ఉన్న Way2News క్లిప్‌ను షేర్ చేసారు. కానీ, మేము Way2News యాప్లో వెతకగా మాకు ఇలాంటి న్యూస్ ఏది కనిపించలేదు. సాధారణంగా  Way2News  క్లిప్‌లో వార్తపై ఒక లింక్ ఉంటుంది. కానీ, వైరల్ అవుతున్న క్లిప్‌లో ఈ లింక్ లేదు. ఆలాగే వైరల్ న్యూస్ క్లిప్‌లో చాలా స్పెల్లింగ్ తప్పలు చూడొచ్చు. సాధారణంగా ఒక వార్తా సంస్థ ఇన్ని తప్పులు చేయదు. వీటన్నిటిబట్టి, ఈ న్యూస్ క్లిప్ Way2News  ప్రచురించింది కాదని, ఎవరో డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.

పైగా ఈ న్యూస్ క్లిప్‌లో ప్రస్తావించిన  ఏబీవీపీ కార్యకర్త వెన్నెల గౌడ్ స్వయంగా ఈ వార్త ఫేక్ అని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

కాగా వైరల్ క్లిప్‌లో షేర్ చేసిన ఏబీవీపీ కార్యకర్త ఫోటో, వీరు ఇంతకుముందు వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన సమయంలో నిరసన తెలిపినప్పుడు తీసింది.

చివరగా, తెలంగాణ ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసన చేపట్టిందని చెప్తున్న ఈ న్యూస్ క్లిప్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll