కొన్ని రాతి స్తంభాలను చూపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ కట్టడం ఇరాన్‌లో ఉందని, ఇది అశోక చక్రవర్తి యొక్క స్తంభం (అశోకుని స్తంభం) అని క్లెయిమ్ చేస్తూ, ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఇప్పటి ఇరాన్‌లో ఉన్న చక్రవర్తి అశోకుడి స్తంభాన్ని ఈ ఫోటో చూపిస్తుంది.
ఫ్యాక్ట్(నిజం): ఇరాన్ యొక్క పురాతన నగరం పెర్సెపోలిస్ అవశేషాలను ఈ ఫోటో చూపిస్తుంది. దీనిని డారియస్-I 518 BCలో అకీమెనిడ్ సామ్రాజ్యం సమయంలో నిర్మించాడు. అకీమెనిడ్ సామ్రాజ్యానికి చాలా కాలం తర్వాత, 321 B.C ప్రాంతంలో, భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం, ఉద్భవించినందున, ఈ రాతి స్తంభాలు మౌర్యుల చేత కట్టబడినవై ఉండడానికి అవకాశమే లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
వైరల్ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ఆ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ ఫొటోలో ఉన్న నిర్మానాన్ని పోలిన కట్టడాన్ని చూపిస్తున్న ఫోటో ఒకటి మాకు UNESCO వారసత్వ ప్రదేశాలను కలిగి ఉన్న వెబ్సైటులో కనిపించింది.

ఈ ఫోటో యొక్క వివరణలో, ఈ నిర్మాణం పెర్సెపోలిస్‌లో (ప్రస్తుత ఇరాన్) ఉన్నదని, ఇది అకీమెనిడ్ సామ్రాజ్యం యొక్క నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుందని రాసి ఉంది. అకీమెనిడ్ సామ్రాజ్యం 550 BC నుండి 330 BC వరకు పాలనలో ఉంది అని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. పెర్సెపోలిస్ నగరాన్ని డారియస్-I, 518 BCలో స్థాపించాడు. ఇది అకీమెనిడ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. అకీమెనిడ్ సామ్రాజ్యం యొక్క కట్టడాలను, మెసొపొటేమియాకు చెందిన నమూనాల నుండి ప్రేరణ పొంది తయారు చేశారు.

డారియస్ కుమారుడు జెర్క్సెస్ పాలనలో పర్షియన్ సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభమైంది. చివరికి 334 BCలో అలెగ్జాండర్ ఈ సామ్రాజ్యాన్ని జయించాడు. వైరల్ ఫొటోలో కనిపిస్తున్న రాతి స్తంభాల కట్టడానికి, అకీమెనిడ్ సామ్రాజ్యం ముగిసిన చాలా కాలం తర్వాత, 321 BC ప్రాంతంలో భారతదేశంలో ఉద్భవించిన మౌర్య సామ్రాజ్యానికి ఎటువంటి సంబంధం లేదని ఈ విషయం స్పష్టం చేస్తుంది.

అలాగే, మౌర్య చక్రవర్తి అశోకుడు 304 BC నుండి 232 BC వరకు మగధను పరిపాలించాడు, ఇది అకీమెనిడ్ సామ్రాజ్యం ముగిసిన చాలా కాలం తర్వాత జరిగింది. తన పాలనా కలానికి ముందే ముగిసిన అకీమెనిడ్ సామ్రాజ్యంలో అశోకుడి స్తంభాలు ఉండడం అసంభవం.
చివరగా, ఇరాన్‌లో ఉన్న ఈ కట్టడం అశోక చక్రవర్తి యొక్క ‘అశోక స్తంభం’ కాదు.