ఎన్నికల కమిషన్ 2024 పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిందని, ఏప్రిల్ 16న ఎన్నికలు జరుగనున్నాయని చెప్తూ ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో ఒక సర్కులర్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ సర్కులర్‌కు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 2024 ఏప్రిల్ 16న పార్లమెంటు ఎన్నికల జరుగనున్నాయి – ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సర్కులర్.
ఫాక్ట్(నిజం): ఇది 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కాదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకే ఇలా ఒక ఊహాజనిత తేదీను ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన ఇంటర్నల్ సర్కులర్ అని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చ్ నెల మొదట్లో షెడ్యూల్ విడుదలైయ్యే అవకాశం ఉందని మీడియా కథనాలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఢిల్లీలోని పార్లమెంట్ స్థానాల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో షేర్ అవుతున్న ఈ సర్కులర్ నిజమే అయినప్పటికీ ఆ సర్కులర్‌లో పేర్కొన్నది అసలైన ఎన్నికల తేదీ కాదు. అది కేవలం ముందస్తు ప్రణాళికల కోసం ఏర్పాటు చేసుకున్న ఒక రిఫరెన్స్ తేదీ మాత్రమే. వైరల్ అవుతున్న సర్కులర్‌లో కూడా ఇది రెఫరెన్స్ కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక తేదీ అని స్పష్టంగా పేర్కొన్నట్టు గమనించొచ్చు.
ఈ సర్కులర్‌కు సంబంధించి సమాచారం వెతికే క్రమంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి దీనిపై వివరణ ఇచ్చిన ట్వీట్ మాకు కనిపించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే ఈ తేదీని ఫిక్స్ చేసుకున్నామని, దానికి తగినట్లుగా ముందస్తు ప్లానింగ్ చేసుకోవడమే దాని ఉద్దేశమంటూ ఢిల్లీ సీఈఓ వివరణ ఇచ్చారు.
ఇలా ఊహాజనితంగా ఒక తేదీ ఫిక్స్ చేసుకుంటే ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోడానికి వీలుగా ఉంటుందనేదే దీని ఉద్దేశమని అయన వివరించారు. చాలా వరకు ఎన్నికల నిర్వహణ పనులు జిల్లా ఎన్నికల అధికారులు/రిటర్నింగ్ అధికారులపై ఉంటుంది కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకే ఇలా ఒక ఊహాజనిత తేదీ ఫిక్స్ చేసి ఒక ఇంటర్నల్ సర్కులర్ విడుదల చేసినట్టు అయన తెలిపారు.
ఈ వివరణ బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్నది 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కాదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చ్ నెల మొదట్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని మీడియా కథనాలు రిపోర్ట్ చేసాయి.
చివరగా, ఇది 2024 పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ కాదు; యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకే ఊహాజనిత తేదీలతో విడుదల చేసిన ఒక ఇంటర్నల్ సర్కులర్ మాత్రమే.