‘మీ పక్కనే తురకలు ఉంటారు జాగ్రత్త. హిందువులను చంపడమే వారి అంతిమ లక్ష్యం, వాళ్ళ మత గ్రంధం అలానే చెబుతుంది’ అంటూ తలకు ముస్లిం టోపీ ధరించిన ఒక వ్యక్తి రాడ్డుతో ఇంకో వ్యక్తిని కొట్టిన వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన భారత్‌లో జరిగినట్టు షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: భారత్‌లో ముస్లిం వ్యక్తి ఒక హిందువును కొట్టి చంపుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన శ్రీలంకలోని గలహ ప్రాంతంలో జరిగింది. ఇదే విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు. పైగా దాడి చేసిన ముస్లిం వ్యక్తి మానసిక రోగంతో బాధపడుతున్నాడని, ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని వారు స్పష్టం చేసారు. ఈ వీడియోలోని ఘటన శ్రీలంకలోని కండిలో ఉన్న గలహ ప్రాంతంలో జరిగినట్టు చెప్తూ 2021లో పలు శ్రీలంక సోషల్ మీడియా పోస్టులు షేర్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వీడియోలో చూపిస్తున్నట్టు ముస్లిం వ్యక్తి మరొక వ్యక్తిని రాడ్డుతో కొట్టిన ఘటన నిజంగా జరిగినప్పటికీ, ఈ ఘటన భారత్‌లో జరగలేదు, ఇది జరిగింది శ్రీలంకలో. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో సింహళంలో మాట్లాడుకోవడం గమనించవచ్చు.
వీడియో స్క్రీన్ షాట్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఘటన శ్రీలంకలోని కండిలో ఉన్న గలహ ప్రాంతంలో జరిగినట్టు చెప్తూ ఇదే వీడియోను 2021లో షేర్ చేసిన పలు శ్రీలంకకు చెందిన సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి.
ఫాక్ట్ క్రెసెండో శ్రీలంక సంస్థ ఈ ఘటన క్యాండీలోని గలాహా ప్రాంతంలో చోటు చేసుకుందని 2021లో రిపోర్ట్ చేసింది. ఈ వీడియోకు సంబంధించిన వివరణ కోసం ఫాక్ట్ క్రెసెండో, సెంట్రల్ ప్రావిన్స్‌లోని గలాహా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించిందగా, OIC రోడ్రిగో ఈ ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగిందని చెప్తూ, దాడి చేసిన ముస్లిం వ్యక్తి మానసిక రోగంతో బాదపడుతున్నాడని తెలిపాడని పేర్కొంది.
ఐతే ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని, దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు, ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు శ్రీలంక పోలీసులు తెలిపినట్టు రిపోర్ట్ చేసింది. దీన్నిబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న ఘటన భారత్‌లో జరిగింది కాదని స్పష్టమవుతుంది.
చివరగా, ముస్లిం వ్యక్తి రాడ్డుతో దాడి చేస్తున్న ఈ ఘటన జరిగింది శ్రీలంకలో, భారత్‌లో కాదు.