గోళాకారంలో ఉన్న భూమిని వరాహ స్వామి తన దంతాలపై ఎత్తినట్లు వర్ణించే ఈ 8వ శతాబ్దపు శిల్పం కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా, ఐహోళ్లోని దుర్గా విష్ణు ఆలయంలో ఉందని పేర్కొంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ శిల్పంలో మన భారతీయ శిల్పులు గెలీలియో కంటే 800 సంవత్సరాల ముందే భూమిని గోళాకారంలో చూపించారని పేర్కొంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గోళాకారంలో ఉన్న భూమిని వరాహ స్వామి తన దంతాలపై ఎత్తినట్లు కర్ణాటకలోని ఐహోళెలోని దుర్గా విష్ణు ఆలయంలోని వరాహ స్వామి శిల్పం చూపిస్తున్నది, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా, ఐహోళెలోని దుర్గా ఆలయంలో ఈ పురాతన శిల్పం వరాహ భగవానుడు గోళాకారంలో ఉన్న భూమిని తన దంతాలపై ఎత్తినట్లు చూపించడం లేదు. వాస్తవంగా, ఈ శిల్పంలో విష్ణువు అవతారాలలో ఒకటైన వరాహ స్వామి తన దంతాలపై శంఖాన్ని ఎత్తడం, అలాగే భుజాలపై భూదేవి (భూమిని ఒక దేవతగా స్త్రీ రూపంలో చూపించడం) ఉన్నట్లు మనం చూడవచ్చు. అంతేకాకుండా, శ్రీ మహా విష్ణువు అవతారాలలో ఒకటైన వరాహస్వామి గోళాకారంలో ఉన్న భూమిని తన దంతాలపై ఎత్తినట్లు చూపించే శిల్పాలను మన భారతదేశ శిల్పులు భూమి గోళాకారంలో ఉన్నట్లు శాస్త్రవేతలు కనుగొనడానికి కన్నా ముందే రూపొందించారని గానీ , లేదా హిందూ గ్రంధాలు భూమి గోళాకారంలో ఉంది అని పేర్కొన్నట్లు సూచించడానికి గానీ ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫొటోలో చూపిస్తున్న వరాహ స్వామి శిల్పంకు సంబంధించిన సమాచారం కోసం, గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇదే శిల్పని చూపిస్తున్న ఫోటో ఒకటి మాకు ‘వికీమీడియా కామన్స్’ వెబ్‌సైట్‌లో లభించింది. “8వ శతాబ్దపు దుర్గా సూర్య దేవాలయం భూదేవితో విష్ణువు యొక్క వరాహ అవతారం, ఐహోల్ హిందూ దేవాలయాల స్మారక చిహ్నాలు” అనే వివరణతో ఈ ఫోటో ప్రచురించబడింది (ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం). కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఐహోల్‌లోని దుర్గా ఆలయంలోని ఇదే వరాహ స్వామి శిల్పాన్ని చూపిస్తున్న ఫోటోలను ‘అలమీ‘ మరియు ‘ఐస్టాక్‘ ఇమేజ్ షేరింగ్ వెబ్‌సైట్‌లలో కూడా మాకు లభించాయి. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో చాళుక్యలు నిర్మించారని తెలుస్తుంది.
మరింత వెతకగా, ఐహోల్‌లోని దుర్గా ఆలయం లోపల చెక్కబడిన వరాహ శిల్పం యొక్క స్పష్టమైన చిత్రం ఒకటి మాకు ‘అలమీ’ వెబ్‌సైట్‌లో మాకు లభించింది. ఇలాంటి స్పష్టమైన చిత్రం ఒకటి భారత ప్రభుత్వ ‘ఇండియన్ కల్చర్’ వెబ్సైటులో కూడా లభించింది. ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ శిల్పంలో శ్రీ మహా విష్ణువు అవతారాలలో ఒకటైన వరాహ స్వామి తన దంతాలపై శంఖాన్ని ఎత్తడం, అలాగే భుజాలపై భూదేవి (భూమిని ఒక దేవతగా స్త్రీ రూపంలో చూపించడం) ఉన్నట్లు మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఐహోల్‌లోని దుర్గా దేవాలయంలోని ఈ శిల్పం వరాహ స్వామి గోళాకారంలో ఉన్న భూమిని తన దంతాలపై ఎత్తినట్లు చూపించడంలేదని మనం నిర్ధారించవచ్చు.
గతంలో కూడా గోళాకారంలో ఉన్న భూమిని వరాహ స్వామి తన దంతాలపై ఎత్తినట్లు చూపిస్తున్న పురాతన శిల్పం ఒకటి ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని శ్రీ జగన్నాథ ఆలయంలోని ఉందని చెప్తూ పలు పోస్టులు వైరల్ కాగా, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు .
హిందూ పురాణాలు భూమి గోళాకారంగా ఉంటుందని చాలా ముందుగానే ఊహించినట్లు వైరల్ వాదన సూచిస్తుంది. అయితే, ఫ్లాట్ ఎర్త్ మరియు రౌండ్ ఎర్త్ సిద్ధాంతాలకు సంబంధించి అనేక చర్చలు జరిగినప్పటికీ, హిందూ గ్రంధాలు భూమిని గోళాకారంగా సూచిస్తాయనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.
కొంతమంది హిందూ పండితులు విష్ణు పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలు భూమిని కమలం ఆకారంలో మరియు నాలుగు మూలలుగా వర్ణించాయని పేర్కొన్నారు. ఉదాహరణకు, రామాయణాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎమ్‌ఎన్ దత్, హిందూ కాస్మోగోనీ(విశ్వోద్భవం) ప్రకారం భూమిని నాలుగు మూలల చదునైన ఉపరితలంగా అభివర్ణించారు.
పురాణాల ప్రకారం, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సముద్రం అడుగున భూమిని తన బందీగా పెట్టుకోగా, అతని నుండి భూమిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించాడని, వరాహుడు రాక్షసుడిని ఓడించి, సముద్రపు లోతు నుండి తన దంతాలపై భూమిని పైకి లేపడాని తెలుస్తుంది.
హిందూ గ్రంధాలు, పురాణాలు భూమిని ఫ్లాట్‌గా అనగా నాలుగు మూలల చదునైన ఉపరితలంగా వర్ణించాయని కొన్ని వాదనలు సూచిస్తున్నాయి. బ్రిటీష్ మరియు బ్రూక్లిన్ మ్యూజియమ్‌లలో లభించిన కొన్ని మధ్యయుగ కాలం నాటి చిత్రాలు, వరాహ స్వామి చదునైన భూమిని (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ) పైకి లేపుతున్నట్లు స్పష్టంగా వర్ణించబడ్డాయి.
అయితే, ఆధునిక శిల్పులు తరుచూ వరాహ స్వామి గోళాకార రూపంలో ఉన్న భూమిని తన దంతాలపై ఎత్తినట్లు తమ శిల్పాలలో చూపించడంతో ఈ వాదన విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఏది ఏమైనప్పటికీ, ఇంతకు ముందు చెప్పినట్లుగా, వరాహస్వామి గోళాకారంలో ఉన్న భూమిని తన దంతాలపై ఎత్తినట్లు చూపించే శిల్పాలను మన భారతదేశ శిల్పులు భూమి గోళాకారంలో ఉన్నట్లు శాస్త్రవేతలు కనుగొనడానికి కన్నా ముందే రూపొందించారని గానీ లేదా ఏదైనా హిందూ గ్రంధాలు భూమి గోళాకారంగా ఉంది అని పేర్కొన్నట్లు సూచించడానికి గానీ ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు.
చివరగా, కర్ణాటక ఐహోళెలోని దుర్గ గుడిలోని ఈ పురాతన శిల్పం వరాహ భగవానుడు గోళాకారంలో ఉన్న భూమిని తన దంతాలపై ఎత్తినట్లు చూపించడం లేదు.