31 ఆగస్టు 2025, 01 సెప్టెంబర్ 2025 చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) దేశాధినేతల 25వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చైనాలో జరిగిన డ్రోన్ షోలో మోదీకి స్వాగతం చెప్తున్నారంటూ రెండు ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఒక ఫోటోలో “MODI WELCOME TO CHINA” అని ఉండగా, మరో ఫోటోలో “VOTE CHORR GADDHI CHHOD” అని ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: చైనాలో జరిగిన ఒక డ్రోన్ షోలో ప్రధాని మోదీ ముఖచిత్రంతో పాటు “MODI WELCOME TO CHINA”, “VOTE CHORR GADDHI CHHOD” వంటి సందేశాలు ప్రదర్శించబడ్డాయి.
ఫాక్ట్: వైరల్ ఫోటోలు ఎడిట్ చేయబడినవి. అసలైన ఫోటో చైనాలో ఏప్రిల్ 2025లో జరిగిన డ్రోన్ షోకి సంబంధించినది. ఇందులో మోదీకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఎటువంటి సందేశాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఆర్టికల్ రాసే సమయానికి చైనాలో మోదీ కోసం డ్రోన్ షో నిర్వహించినట్లు ఎటువంటి విశ్వసనీయ కథనాలు, అధికారిక ప్రకటనలు లభించలేదు.
ఇక వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటో ఉన్న ఒక వార్తా కథనం (ఆర్కైవ్) లభించింది. దీనిని చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా 20 ఏప్రిల్ 2025న ప్రచురించింది. ఈ ఫోటోని 19 ఏప్రిల్ 2025న చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని నానాన్ జిల్లాలో జరిగిన డ్రోన్ లైట్ షో సందర్భంగా తీశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మోదీ చైనా పర్యటన కంటే నాలుగు నెలల ముందే జరిగింది. ఈ ఫోటోలో కేవలం ఒక యువతి డాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న దృశ్యం మాత్రమే ఉంది. వైరల్ ఫోటోలలో ఉన్నట్లుగా మోదీకి స్వాగతం పలుకుతున్న సందేశాలు లేవు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ కార్యక్రమం పేరు గ్లామరస్ చాంగ్కింగ్ డ్రోన్ లైట్ షో. 19 ఏప్రిల్ 2025లో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం, సెలవు దినాలలో నిర్వహిస్తారు. ఇక వైరల్ ఫోటోలని అసలు ఫోటోతో పోల్చి చూడగా, వైరల్ ఫోటో మోదీ ముఖంతో పాటుగా “MODI WELCOME TO CHINA”, “VOTE CHORR GADDHI CHHOD” అనే వాఖ్యాలు ఎడిట్ చేసినట్లుగా గుర్తించవచ్చు.

చివరిగా, ప్రధాని మోదీకి డ్రోన్ షో ద్వారా చైనాలో స్వాగతం పలికారంటూ ప్రచారంలో ఈ ఫోటోలు ఫేక్.